
విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్‌ఓ అప్పయ్య
శాయంపేట: ప్రజలు విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని, వైద్య సిబ్బంది మందుల పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పత్తిపాక, ప్రగతి సింగారంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి రికార్డులు, మందులు పరిశీలించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఐరన్ సిరప్, యాంటీబయాటిక్ సిరప్‌లు కొన్ని చోట్ల ఇవ్వట్లేదని కలెక్టర్ దృష్టికి రాగా శాయంపేటలో ఉన్నాయా లేదా.. పరిశీలించి ఫార్మసిస్టులతో మాట్లాడారు. అనంతరం పత్తిపాక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాలు పరిశీలించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఎంత మందికి పరీక్షలు చేశారో తెలుసుకున్నారు. ఈసందర్భంగా డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ.. విష జ్వరాలపై వైద్యులు సిబ్బందితో సర్వే చేయించి ఎప్పటికప్పుడు వైద్యం అందించాలన్నారు. ఏ గ్రామంలో ఎక్కువ జ్వరాలు వస్తే అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండడంతో పాటు సిబ్బంది ప్రతీరోజు 25 ఇళ్లను సందర్శించడంతో పాటు డ్రైడేపై అవగాహన కలిగించాలన్నారు. టెస్టింగ్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణ, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.