
జనహిత పేరుతో కొత్తడ్రామా
● ఏ ఒక్క హామీ అమలు చేయని
కాంగ్రెస్ ప్రభుత్వం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్
వర్ధన్నపేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసిందని, ఏ ఒక్క హామీ అమలు చేయని కాంగ్రెస్ ఇప్పుడు జనహిత కార్యక్రమం పేరుతో పర్యటించడం విడ్డూరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆరోపించారు. మంగళవారం పట్టణకేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ..ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసి గద్దె ఎక్కిన సీఎం రేవంత్‌రెడ్డి, హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వరంగల్ రెండో రాజధాని అంటూనే కనీస నిధులు విడుదల చేయకుండా ప్రజల్ని మాయచేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ.. దమ్ముంటే తక్షణమే 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నం సతీశ్, రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు బన్న ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండేటి సత్యం, జిల్లా కార్యదర్శి జడ సతీశ్, అధికార ప్రతినిధి మహేందర్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు రాయబారపు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.