
పంట పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తలు
నడికూడ: మండలంలోని కంఠాత్మకూర్‌లో పత్తి, వరి, పసుపు పంటలను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ శాస్త్రవేత్తల బృందం మంగళవారం మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్‌తో కలిసి పంట క్షేత్రాలను పరిశీలించింది. ఈసందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త, కో–ఆర్డినేటర్ డాక్టర్ విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. పత్తి పంటకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల నివారణకు వేపనూనే ఎకరాకు లీటర్ మందు చొప్పున లేదా అసిఫేట్ ఎకరాకు 300 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలన్నారు. ఆలస్యంగా విత్తిన పత్తిలో 1:20 నిష్పత్తిలో ఫ్లునికామైడ్ మందును నీటిలో కలుపుకుని బొట్టు పెట్టే పద్ధతి ద్వారా లేదా కాండానికి పూసుకోవాలని సూచించారు. ఆలస్యంగా వరి సాగు చేసేవారు స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని, గడ్డి జాలి కలుపు మొక్కల నివారణకు ఫినాక్సి ప్రాప్ ఈథైల్ మందును ఎకరానికి 350 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచాకారీ చేయాలన్నారు. పసుపు పంటలో అధిక వర్షాల వలన దుంప కుళ్లు, దుంప పుచ్చు ఆశించే అవకాశం ఉందని, నివారణకు వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రాజ్‌కుమార్, విశ్వతేజ, ఏఈఓ గోపీనాఽథ్, అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు.