
సొసైటీలో మోసం
● రూ.6లక్షలు కాజేసిన గోదాం కీపర్
● రికవరీ, విధుల నుంచి తొలగింపు
సంగెం: సొసైటీ ఎరువుల గోదాం కీపర్ రూ.6లక్షలు మోసం చేసి దొరికిపోయిన ఘటన సంగెం మండలంలో చోటుచేసుకుంది. సోమవారం విలేకర్ల సమావేశంలో కాపులకనిపర్తి సొసైటీ చైర్మన్ దొమ్మాటి సంపత్‌గౌడ్, సీఈఓ రమణాచారి మోసానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాపులకనిపర్తి గ్రామానికి చెందిన పసునూరి రమేశ్‌ను సొసైటీ ఎరువుల గోదాం ఇన్‌చార్జ్(తాత్కాలిక ఉద్యోగి)గా గత ఏడాది నియమించుకున్నారు. ఈ ఏడాది జూన్ 21న గోదాంలో విక్రయించిన 220 బస్తాల వివిధ రకాల ఎరువులు అమ్మినా రూ.1,00,077లు సొసైటీకి జమ చేయలేదు. 10,11 నంబర్ బిల్లు బుక్‌లు కన్పించకుండా పోయాయి. డబ్బులు జమచేయాలని నిలదీయడంతో రమేశ్ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. దీంతో రమేశ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాలకవర్గం సభ్యులు, రమేశ్ తండ్రి రాజ య్య ఇతరుల సమక్షంలో గోదాంలోని ఎరువులను లెక్కించగా 4,96,312 రూపాయల విలువైన వివిధ రకాలు 432 బస్తాలు తక్కువగా ఉన్నాయి. దీంతో మొత్తం రూ.5,96,389లు మోసం జరిగినట్లు తేల్చగా పెద్దమనుషుల సమక్షంలో ఒప్పుకున్న రమేశ్ రూ.లక్ష జమచేశాడు. మిగిలినవాటిలో సెప్టెంబర్ 6న రెండు లక్షలు, మిగి లినవి నవంబర్‌లో చెల్లించేవిధంగా ఒప్పందపత్రం రాయించుకున్నట్లు తెలిపారు. రమేశ్‌ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. డైరెక్టర్ బానోత్ కిషన్‌నాయక్, భిక్షపతి పాల్గొన్నారు.

సొసైటీలో మోసం