
పీసు తోడింది..పంట ఎండింది
నర్సంపేట: నకిలీ మొక్కజొన్న విత్తనాలు నట్టేట ముంచాయి. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి మొక్కజొన్న విత్తనాలతో తీవ్రనష్టం వాటిల్లింది. దీంతో బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. వివరాల్లోకి వెళితే... చెన్నారావుపేట మండలంలోని బోడ మాణిక్యంతండా గ్రామానికి చెందిన భూక్య వాలునాయక్ గోద్రెజ్ 105 కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలను నర్సంపేటలోని పరమేశ్వర సీడ్స్ షాపులో రూ.8,500లు వెచ్చించి ఐదు ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. జూన్‌లో తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న విత్తనాలను వేసి సాగు చేశాడు. మొక్కజొన్న కర్రలు ఏపుగా పెరిగి పీసులు తోడాయి. కానీ మొక్కజొన్న కర్రలకు కంకులు లేవు.. గింజలు లేవు. మొక్కజొన్న చేనంతా ఎండిపోతోంది. దీంతో బాధిత రైతు లబోదిబోమంటూ పరమేశ్వర సీడ్స్ యజమానిని నిలదీశాడు. దీంతో అతడు గోద్రెజ్ 105 విత్తన కంపెనీ సేల్స్ ఆఫీసర్‌కు సమాచారం అందించాడు. సేల్స్ ఆఫీసర్ ఐదు రోజుల క్రితం వచ్చి పంటను పరిశీలించి వెళ్లిపోయాడు. కానీ ఇప్పటివరకు స్పందించడం లేదని రైతు వాలునాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. మొక్కజొన్న పంట సాగు చేయడానికి రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టానని ఆందోళన చెందుతున్నాడు. వ్యవసాయ శాఖ అధికారులు మొక్కజొన్న పంటను పరిశీలించి నకిలీ మొక్కజొన్న విత్తనాలను అంటగట్టిన పరమేశ్వర సీడ్స్ షాపు యజమాని, గోద్రెజ్ 105నకిలీ మొక్కజొన్న విత్తన కంపెనీపై తగిన చర్యలు తీసుకొని తనకు నష్టపరిహారం అందించాలని బాధిత రైతు భూక్య వాలునాయక్ వేడుకుంటున్నాడు.
నట్టేట ముంచిన నకిలీ మొక్కజొన్న
విత్తనాలు
రెండున్నర ఎకరాల్లో సాగు చేస్తే
తీవ్ర నష్టం
ఆదుకోవాలని బాధిత రైతు వేడుకోలు

పీసు తోడింది..పంట ఎండింది

పీసు తోడింది..పంట ఎండింది