
జాగ్రత్తే రక్ష..
నర్సంపేట: జిల్లావ్యాప్తంగా గణేశ్ వేడుకల సందడి నెలకొంది. గణపతి కమిటీలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈనెల 27న వినాయకచవితి నుంచి నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. దీంతో విగ్రహాల కొనుగోళ్లు, మండపాల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో విగ్రహాల తరలింపు, విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటులో జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. మండపాల వద్ద కనెక్షన్ల కోసం సిబ్బందిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు..
● విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్నా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
● విగ్రహాలను మండపాలకు తరలించే క్రమంలో ముందుగా రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకోవాలి.
● వెళ్లే దారిలో విద్యుత్ తీగల వల్ల ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే సిబ్బందికి తెలియజేసి సమస్యను పరిష్కరించుకోవాలి.
● నిమజ్జనానికి చెరువులు, వాగులు, వంకల వద్ద కు వెళ్లే సమయంలో వరుసక్రమంలో వెళ్లాలి.
● ఊరేగింపు సమయంలో చీకటి వేళ విద్యుత్ తీగలు కనబడవు. జాగ్రత్తగా వ్యవహరించాలి.
మండపాల వద్ద పాటించాల్సిన నియమాలు..
● వినాయక మండపాల వద్ద ఉత్సవ కమిటీ బాధ్యులు పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
● విద్యుత్ సరఫరా కోసం స్తంభాలు ఎక్కకూడదు. సిబ్బంది ద్వారా విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
● నాణ్యమైన ప్రమాణాలు కలిగిన విద్యుత్ బోర్డులు, వైర్లు, స్విఛ్‌లు వాడాలి.
● అతుకులతో కూడిన సర్వీస్ వైర్లు వినియోగించవద్దు. కెపాసిటీ కలిగిన ఎంసీబీ వినియోగించడం ద్వారా ప్రమాదాలను తప్పించుకోవచ్చు. విద్యుత్ కనెక్షన్ పొందే సమయంలో పరిసరాలను క్షుణ్ణంగా గమనించాలి.
● ఎవరికై నా ప్రమాదం జరిగితే వెదురు, ప్టాస్టిక్ బొంగులతో రక్షించే ప్రయత్నం చేయాలి.
● మండపాలు, ఊరేగింపులు, శోభయాత్రల సమయంలో విద్యుత్ సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1912కి కాల్ చేయాలి.
ఆందోళన కలిగిస్తున్న ఇటీవల ప్రమాదాలు..
ఇటీవల శ్రీకృష్ణాష్టమి, వినాయక విగ్రహాల తరలింపులో విద్యుత్ ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో శ్రీకృష్ణ వేడుకలు సందర్భంగా తొమ్మిది మంది విద్యుదాఘాతానికి గురై అందులో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్‌తో పాటు నిజామాబాద్‌లోనూ వినాయక విగ్రహాలను తరలిస్తూ విద్యుదాఘాతానికి పలువురు మృతి చెందారు. దీంతో వినాయక వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు.
గణేశ్ నవరాత్రులకు సర్వం సిద్ధం
వినాయక విగ్రహాలను బుకింగ్ చేస్తున్న కమిటీలు
విగ్రహాల తరలింపు, ప్రతిష్ట,
శోభాయాత్రలో అప్రమత్తతే మేలు