
ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి
● సెప్టెంబర్ 15 నాటికి గృహ ప్రవేశాలకు సిద్ధమవ్వాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్
కమలాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండలంలోని గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాలను, మండలంలోని దేశరాజుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని గృహ నిర్మాణ, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతుల కల్పన, దేశరాజుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి గురించి ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ 15 వరకు గృహ ప్రవేశాలకు సిద్ధం చేసి ఉంచాలని లబ్ధిదారులు, అధికారులకు సూచించారు. 45 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఇళ్లు రద్దు చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ గుండె బాబు, తహసీల్దార్ సురేశ్‌కుమార్, హౌసింగ్ డీఈ సిద్ధార్థ నాయక్, ఆర్‌అండ్‌బీ డీఈ రాజు పాడ్యా, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.