
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్
● హనుమకొండ, వరంగల్ కలెక్టర్లతో మంత్రి సమీక్ష
హన్మకొండ: ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ, సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ కలెక్టర్ సత్యశారదతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు తీరు, సంక్షేమ, గురుకుల పాఠశాలల, కళాశాలల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు అందుతున్న భోజన, వసతి, జరుగుతున్న లోపాల్ని గుర్తించి సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గురుకుల, ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదులు పెట్టె క్రమం తప్పకుండా పరిశీలించాలని, ఫిర్యాదుల బాక్సులో వస్తున్న ఫిర్యాదులు వాటికి గల కారణాలను వెంటనే తెలుసుకొని పరిష్కార మార్గాలను చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాదించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కే.ఆర్.నాగరాజు, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, ఆయా గురుకులాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.