
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ధర్మసాగర్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు. మండలంలోని కరుణాపురం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలలో శనివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వైద్య శిబిరంలో 109 మంది విద్యార్థులను పరీక్షించి వారి ఆరోగ్య సమస్యలకు తగిన మందులు అందజేశారు. దాదాపు 67 మందికి ఆర్డీటీ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ మలేరియా నెగిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శృతి, డాక్టర్ రుచిత, డాక్టర్ మహేందర్ రావు, హెల్త్ సూపర్‌వైజర్లు ప్రసన్న కుమారి, రామ్మోహన్ రావు, హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, ఏఎన్‌ఎం రజిత, ఆశ వర్కర్లు స్వరూప, రేణుక, రజిత, లక్ష్మి, రాణి, మహేశ్వరి, రాధిక, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.