
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
● డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య
నడికూడ: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కంఠాత్మకూరులో ఇంటింటికీ తిరిగి పరిసరాలను పరిశీలించారు. గ్రామస్తులకు డెంగీ నివారణపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. నీరు నిల్వ ఉంటే సీజన్ వ్యాధులతో పాటు, మలేరియా, డెంగీ, టైఫాయిడ్ తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్రజలకు ఫీల్డ్‌లో అందుబాటులో ఉంటూ.. ఇంటింటికీ వెళ్లి చికిత్స అందించాలన్నారు. సమయపాలన పాటిస్తూ.. మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ దివ్య, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.