హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్‌లో నేడు (శుక్రవారం) పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ అదాలత్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెన్షన్, జీపీఎఫ్ కేసులు, ఖాతాల సమస్యలు చర్చించి పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆయా ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
సిమెంట్ పోల్ ఏర్పాటు
దుగ్గొండి: ‘ఇనుప స్తంభానికి విద్యుత్’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన వార్తకు విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. మండలంలోని తిమ్మంపేట గ్రామంలో నారాయణతండా రోడ్డుకు సమీపంలోని వ్యవసాయ బావుల వద్ద ప్రమాదకరంగా ఉన్న ఇనుప స్తంభం తొలగించి గురువారం సిమెంట్ స్తంభం ఏర్పాటు చేశారు. వైర్లు సరిచేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏఈ ప్రత్యూష, లైన్ ఇన్‌స్పెక్టర్ అజీంపాషా, సిబ్బంది పాల్గొన్నారు.
రేకులతండాలో తాగునీటికి కటకట
నెక్కొండ: మండలంలోని పెద్దకొర్పోలు గ్రామ శివారు రేకులతండాలో తాగు నీటి కటకట ఏర్పడింది. తండాలో తీజ్ ఉత్సవాల వేళ తాగు నీటి సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈసందర్భంగా తండావాసులు మాట్లాడుతూ.. గత ఆరు నెలల నుంచి మిషన్ భగీరథ నీరు రావట్లేదని, 15 రోజుల క్రితం నల్లాల బావి మోటారు కాలిపోయిందన్నారు. తీజ్ పండుగ వేళ రోడ్డెక్కి నిరసన తెలపాల్సి వస్తోందన్నారు. ఈవిషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజేశ్‌ను వివరణ కోరగా.. పొంతన లేని సమాధానాలతో దాటవేశారు.
అతివల అక్షరాస్యతకు ‘ఉల్లాస్’
నెక్కొండ: గ్రామీణ ప్రాంతాల్లో చదవడం, రాయడం రాని వృద్ధులు, మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) అనే పథకానికి శ్రీకారం చుట్టాయని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి సుజన్‌తేజ అన్నారు. స్థానిక హైస్కూల్‌లో ఎంఈఓ రత్నమాల అధ్యక్షతన ఉల్లాస్‌పై మహిళా సంఘాల వీఓలకు గురువారం శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ రంగారావు, ఏపీ ఓ కిరణ్, మండల రిసోర్స్‌పర్సన్స్ ప్రతాప్, రా మ్మోహన్, వీఓఏలు, ఉపాధ్యాయులున్నారు.
గుణాత్మక విద్యనభ్యసిస్తూ ఎదగాలి
డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్
ఖిలా వరంగల్: దైనందిన జీవితాన్ని సుఖమయం చేసుకోవడంతోపాటు గుణాత్మక విద్యనభ్యసిస్తూ ఎదగాలని డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ దివ్యాంగ విద్యార్థులకు సూచించారు. గురువారం వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (ఎలిమ్కో) వారి సౌజన్యంతో మానసిక శారీరక, ఆటిజం, బహుళ వైకల్యం, కృత్రిమ అవయవాల వినియోగం, ఉపయోగాలపై దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాద్, డాక్టర్ కోమల్‌పహడ్, డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ శివమ్ శుక్ల, మెడికల్ ఆఫీసర్ రమ్య, ఫిజియో థెరఫిస్ట్ స్వాతి, ఐఈఆర్పీ నరసింహస్వామి, సంజీవ్, శ్రీకాంత్, రవి పాల్గొన్నారు.

రేకులతండాలో తాగునీటికి కటకట