
‘మేడారం 2026’ నిర్వహణకు రూ.150 కోట్లు
ఉప్పొంగిన గోదావరి..
– 8లోu
సాక్షిప్రతినిధి, వరంగల్/ఏటూరునాగారం: వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ కుంభమేళా, సమ్మక్క, సారలమ్మల మేడారం మహాజాతరకు భారీగా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.150 కోట్లు మంజూరు చేస్తూ శాఖలవారీగా బడ్జెట్‌ను కేటాయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారీగా నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు రాష్ట్ర సీ్త్ర శిశుసంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర
ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపుపొందింది. ఈ జాతర తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. అందుకే మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు తరలివచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు నిధులు మంజూరు చేసింది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు మహాజాతర నిర్వహించనున్నారు. ఇప్పటికే సమ్మక్క–సారలమ్మ పూజారులు జాతర తేదీలను ప్రకటించారు.
తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దైపెకి చేరుకుంటారు. రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు. మూడో రోజు జనవరి 30న సమ్మక్క సారలమ్మను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31న సాయంత్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశంతో జాతర ముగియనుంది.
ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాక..
మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.
గత ఏడాది రూ.110 కోట్లు
గత ఏడాది 2024 మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.110కోట్లు మంజూరు చేసి మేడారంలో పలు అభివృద్ధి పనులు చేసింది. భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు ఈసారి అదనంగా రూ.40 కోట్లు పెంచి రూ.150కోట్లు చేయడం గమనార్హం. 2022లో అప్పటి ప్రభుత్వం రూ.75 కోట్లను మేడారం జాతర నిర్వహణకు మంజూరు చేసింది.