
వరంగల్ మహా నగరాన్ని తీర్చిదిద్దండి
సంగెం: వలస పాలకుల నిర్లక్ష్యం, విధ్వంసానికి గురైన వరంగల్ మహానగరాన్ని తీర్చిదిద్దాలని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా పాలకులతో వరంగల్‌లోని ఆజంజాహి మిల్లు మూతబడి, బీడీల పరిశ్రమలు కాలగర్భంలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటిక్యాల మధుసూదన్‌రావు, ఎమ్మెస్ రాజలింగం, టీఎస్ మూర్తి వంటి నిస్వార్థ రాజకీయ నాయకుల చొరవతో ఎన్‌ఐటీ, కేఎంసీ సంస్థలు వచ్చాయన్నారు. వలస పాలకులు అభివృద్ధి చేయకపోవడంతోనే జిల్లాలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని గుర్తుచేశారు. వరంగల్ సెంట్రల్ జైలును కూలగొట్టి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు తాకట్టు పెట్టి 1200 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని ధ్వజమెత్తారు. వీటిని జీర్ణించుకోలేని ప్రజలు గత పాలకులను ఓడించి కాంగ్రెస్‌కు పట్టం కట్టారని వివరించారు. ప్రముఖ సామాజికవేత్త సోమ రామమూర్తి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ