
యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
రాయపర్తి: యూరియా సరఫరాలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌తోపాటు ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులను కలెక్టర్ వ్యవసాయాధికారులతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. షాపుల్లోని యూరియా, ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ షాపులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా యూరియా పంపిణీ సక్రమంగా చేపట్టాలని సూచించారు. యూరియా కోసం పురుగుమందులు, ఇతర వస్తువులను అంటగడుతున్నారని కలెక్టర్ ఎదుట రైతులు వాపోయారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఫర్టిలైజర్ షాపుల నిర్వాహకులు అలాంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. యూరియా బస్తాలను పక్కదారి పట్టించి కృత్రిమ కొరత సృష్టించేవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. షాపుల వద్ద అధికారులు ఉండి యూరియా పంపిణీ పర్యవేక్షించాలని సూచించారు. యూరియాకు బదులు ప్రత్యామ్నాయంగా నానో యూరియా పంటలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, 45 కిలోల యూరియా బస్తాకు సమానంగా 500 మిల్లీలీటర్ల నానో యూరియా సరిపోతుందని రైతులకు అవగాహన కల్పించారు.
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన..
మండల కేంద్రం, పెర్కవేడు గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో వైద్యశిబిరాన్ని పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు అందించాలని ఆదేశించారు. భోజనం ఎలా ఉందని బాలికలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, గృహనిర్మాణ శాఖ పీడీ గణపతి శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ గుగులోత్ కిషన్‌నాయక్, ఏఓ గుమ్మడి వీరభద్రం ఉన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద