
వివాహిత ఆత్మహత్య
నర్సంపేట రూరల్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం నర్సి నాయక్ తండాకు చెందిన అజ్మీరా వీరమ్మ కుమార్తె సునీత (28) పీజీ చదివింది. 18 నెలల క్రితం చక్రంతండాకు చెందిన భూక్యా భద్రుతో సునీతకు వివాహమైంది. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి సునీతను భద్రు వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగం చేస్తుండడంతో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె పుట్టింటికి వచ్చి ఉంటోంది. ఈ విషయమై పలు మార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ సైతం చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తీవ్ర మనోవేదనకు గురైన సునీత మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు తండాలో వెతికినా ఆచూకీ లభించలేదు. చివరికి గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలో సునీత మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అరుణ్‌కుమార్ బావి నుంచి ఆమె మృతదేహాన్ని బయటకు తీయించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఎస్సై తెలిపారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పేరుతో మోసగించి
పెళ్లి చేసుకున్నాడని మనస్తాపం
నర్సినాయక్‌తండాలో బలవన్మరణం