
కాజీపేట దర్గా ఉత్సవాలు షురూ
కాజీపేట దర్గా
కాజీపేట రూరల్: కాజీపేట హజరత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. క్రీస్తుశకం 1865లో సఫర్ 26న హజరత్ భగవంతునిలో లీనమైన దినాన దర్గాను నిర్మించి ఉర్సు ఉత్సవాలను ఆరంభించి నేటికి కొనసాగిస్తున్నట్లు ముస్లిం మతపెద్దలు తెలిపారు. హిజ్రి క్యాలెండర్ ప్రకారం ప్రతీ సఫర్ నెలలో ఉత్సవాలు జరుగుతాయని, హిందు, ముస్లిం సమైక్యతకు హజరత్ సయ్యద్ షా అప్జల్‌బియాబాని దర్గా ఉత్సవాలు ప్రత్యేకతను చాటుతున్నాయని చరిత్ర చెబుతోంది. దర్గాను దర్శించుకొని పార్థనలతో వేడుకుంటే తమ సమస్యలు, బాధలు పోయి అనుకున్నవి జరుగుతాయని ప్రజలు నమ్మకం. ఈ ఉత్సవాలకు దేశ, విదేశాల నుంచి కులమత భేదం లేకుండా లక్షలాది మంది వస్తారని దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా తెలిపారు.
రేపు చందనోత్సవం
ఉర్సులో భాగంగా బియాబాని సమాధిని రోజ్‌వాటర్‌తో శుద్ధి చేస్తారు. 21న గురువారం అర్ధరాత్రి గంధం (సందల్) వేడుక ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది. బడేఘర్ వద్ద ఖుస్రుపాషా కుటుంబీకులు ఆనవాయితీగా స్వయంగా గంధం చెక్కలతో గంధాన్ని తయారు చేస్తారు. ఆ రోజు రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సందల్ వేడుకలో ఖుస్రు పాషా వెండి పాత్రలో గంధం లేపనం, వస్త్రాలను, రోజ్‌వాటర్‌ను గుర్రాలు, బ్యాండ్ మేళతాళాలతో భక్తుల మధ్య ఊరేగింపుగా తీసుకవస్తారు. అనంతరం రోజ్‌వాటర్‌తో బియాబాని సమాధిని కడిగి శుద్ధి చేసి గంధం లేపనాన్ని పూసి, పూలమాలలు, పట్టు వస్త్రాలు, సమర్పించి ఉత్సవాలు ప్రారంభిస్తారు. 22వ తేదీన ఉర్సు ఉత్సవాలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారుల సందర్శన, 23వ తేదీన బదావా ముగింపులో ఫకీర్ల విన్యాసాలు ఉంటాయి.
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
–సయ్యద్ గులాం అప్జల్ బియాబాని
ఖుస్రుపాషా, దర్గా పీఠాధిపతి
కాజీపేట దర్గా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహకారంతో తరలివచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం, రోడ్లు, ట్రాఫిక్, డ్రెయినేజీలు, శానిటేషన్, వైద్యం, ఉండేందుకు బస, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశాం. మూడు రోజుల ప్రధాన ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దర్గాను సందర్శిస్తారు.
కులమతాలకతీతంగా ఉర్సు ఉత్సవాలు
రేపు అర్ధరాత్రి గంధంతో
ప్రధాన ఉత్సవం ప్రారంభం
22న ఉర్సు, 23న బదావా (ముగింపు)
దేశ నలుమూలలనుంచి రానున్న భక్తులు

కాజీపేట దర్గా ఉత్సవాలు షురూ