
మరమ్మతులు చేపట్టండి
బల్దియా పాత భవనాన్ని పరిశీలించిన
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
రామన్నపేట: ఇటీవల కురిసిన వర్షాలకు బల్దియా ప్రధాన కార్యాలయంలో పెచ్చులూడి ప్రమాదకరంగా ఉన్న వివిధ విభాగాల్లో పైకప్పు (సీలింగ్)లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయ పురాతన భవనంతో పాటు మేయర్ చాంబర్‌పై భాగంలోని అంతస్తును కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా భవన స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల కురిసిన వర్షాలకు హెల్త్ విభాగంలోని చాంబర్‌లో పైకప్పులో నీరు చేరి సీలింగ్ కూలి కంప్యూటర్‌పై పడిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని కమిషనర్ పరిశీలించారు. కూలిన సీలింగ్‌తో పాటు ప్రమాదకరస్థితిలో ఉన్న సీలింగ్‌లకు మరమ్మతులు చేయించాలన్నారు. హెల్త్ విభాగంతో పాటు, బర్త్ అండ్ డెత్ విభాగాల్లో మరమ్మతులు పూర్తయ్యే వరకు ఆ విభాగాలను తాత్కాలికంగా మేయర్ చాంబర్ ఉన్న మొదటి అంతస్తులోకి తరలించాలని, పురాతన భవనంలో ప్రమాదకరస్థితిలో ఉన్న ఇతర విభాగాలను గుర్తించి వాటికి కూడా మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్‌చార్జి ఎస్‌ఈ మహేందర్, ఏంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, పర్యవేక్షకులు ఆనంద్ పాల్గొన్నారు.