
వానల కాలం.. ప్రాణాలు పదిలం
హన్మకొండ: వర్షాకాలంలో విద్యుత్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఏమాత్రం ఆదమరిచినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి. తడిదుస్తులు ఆరేస్తూ, మోటార్లు ఆన్ చేస్తూ, మరమ్మతుల సమయంలో విద్యుత్ తీగలు పట్టుకుని, తెగిన తీగల కారణంగా తరచూ వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తెగిన విద్యుత్ లైన్లు, టాన్స్‌ఫార్మర్ గద్దెలు ఎత్తు తక్కువగా ఉండడంతో పశువులు విద్యుదాఘాతానికి గురై చనిపోతున్నాయి. ఈక్రమంలో విద్యుత్ వినియోగదారులు, రైతులు వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. పాటించాలి. విద్యుత్ సిబ్బంది భద్రతా చర్యలు పాటించకపోవడంతో పాటు ఎల్‌సీల్లో నిబంధనలు పాటించకపోవడం, నిర్లక్ష్యం కారణంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
క్షేత్రస్థాయిలో అవగాహన..
జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా సర్కిల్‌లోని డీఈ టెక్నికల్ ఆధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించి విద్యుత్ ప్రమాదాల నివారణకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కృషి చేస్తోంది. పొలం బాట ద్వారా రైతులకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులు, వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లో సంస్థ చేయాల్సిన విద్యుత్ పనులు సొంతగా చేయొద్దని అధికారులు చెబుతున్నారు. భద్రతపై ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, సిబ్బందికి అన్ని రకాల భద్రత పరికరాలు హెల్మెట్, గ్లౌవ్స్, పోర్టబుల్ ఎర్తింగ్, షార్ట్ సర్క్యూట్ కిట్లు, సేఫ్టీ షూస్, ఇన్సులేటెడ్ టూల్స్, వోల్టేజ్ డిటెక్టర్ వంటివి అందించారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
● తడిసిన విద్యుత్ స్తంభాల స్టే వైర్, సపోర్ట్ వైరును, ట్రాన్స్‌ఫార్మర్, తడిచిన విద్యుత్ ఉపకరణాలను తాకవద్దు.
● దండెం వైర్లను, విద్యుత్ వైర్లను కలుపవద్దు. సపోర్ట్ వైర్లుగా ఇన్సులేటెడ్ జిఐ వైర్లను ఉపయోగించాలి.
● వోల్టేజ్‌లో హెచ్చుతగ్గులు ఉన్నా, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద శబ్దం వస్తున్నా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి.
● వర్షాల కారణంగా చెట్ల కొమ్మలు విద్యుత్ వైర్లకు తాకి షాక్ కొట్టే ప్రమాదం ఉంది. గమనించాలి.
● వ్యవసాయ నిమిత్తం, గృహాల్లో అతుకులు లేని సర్వీస్ వైరును మాత్రమే ఉపయోగించాలి.
● తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకవద్దు, వెంటనే సంబంధిత సిబ్బందికి తెలియజేయాలి.
● ఎవరికై నా పొరపాటున కరెంట్ షాక్ సంభవిస్తే దగ్గరలోని వ్యక్తులు షాక్‌కు గురైన వ్యక్తిని రక్షించాలన్న అత్రుతతో ప్రమాదం సంభవించిన వ్యక్తిని ముట్టుకోవద్దు.
● రైతులు పంపు సెట్లను వాడుతున్నప్పుడు కరెంట్ మోటార్లకు కాని, పైపులను కాని, ఫుట్ వాల్వులను ఏమరపాటుతో తాకకూడదు. వ్యవసాయ పంపు సెట్లను , స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయవలెను. విద్యుత్ ప్రమాదాలు ఎర్త్ చేయబడని పరికరాల వల్లే జరుగుతాయి.
● డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేర్ చేయడం, ఎబీ స్విచ్‌లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం.
● మోటారు పంపుసెట్లకు ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే సొంతంగా సరిచేద్దామని ప్రయత్నిస్తే ప్రాణనష్టం, హాని జరగవచ్చు.
● గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్‌లను సంప్రదించి వారి సేవలను పొందాలి.
● ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరికరాలు అందుబాటులో వచ్చిన ప్రస్తుత తరుణంలో వాటిని వినియోగించడం ద్వారా ప్రమాదాల నుంచి బయటపడవచ్చు.
● విద్యుత్ పరికరాలు, వైరింగ్, వ్యవసాయ మోటార్లు, స్టార్టర్లు బ్యూర్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గుర్తింపు కలిగినవి వాడాలి.
జాగ్రత్తగా ఉండాలి...
రోజు వర్షం కురుస్తున్నందున ప్రజలు విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు నివారించడానికి సమష్టి కృషి అవసరం. విద్యుత్ సమస్యలు తలెత్తితే 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలి. – కాసిడి గౌతంరెడ్డి,
ఎస్‌ఈ, వరంగల్ సర్కిల్
వరంగల్ జిల్లాలో..
వినియోగదారులు 4,20,925,
ఇందులో గృహ వినియోగదారులు 2,99,091
వ్యవసాయ వినియోగదారులు 70,853
విద్యుత్ సబ్‌స్టేషన్లు 76
డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 12,467
విద్యుత్ వినియోగంలో అప్రమత్తత
అవసరం
ఆదమరిస్తే అంతే సంగతులు
సొంతంగా మరమ్మతులు చేయవద్దు..
విస్తృత అవగాహన కల్పిస్తున్న అధికారులు

వానల కాలం.. ప్రాణాలు పదిలం