
సహకారం మరింతగా..
నర్సంపేట: సొసైటీల నుంచి రైతులకు అందనున్న సేవలు మరో ఆరు నెలలు పొడిగించడం వారికి ఎంతో ప్రయోజనకరం కానుంది. పంటల సాగులో రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి పలు రకాల సేవలు అందాలంటే స్థానికంగా అందుబాటులో ఉంటున్న చైర్మన్ల కృషి ఎంతో ఉంటుంది. ఈనెల 14వ తేదీన చైర్మన్ల పదవీ కాలం ముగియడంతో ఒకింత రైతులు ఆందోళన చెందారు. ప్రధానంగా వరంగల్ జిల్లాలో వరి పంట అధికంగా సాగు చేస్తున్న రైతులకు యూరియా, డీఏపీ అందించడంలో సొసైటీ చైర్మన్ల పాత్ర కీలకంగా మారింది. జిల్లాలో 98 పీఏసీఎస్ సొసైటీలు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈనెల 14వ తేదీ వరకు పదవీ కాలం ముగిస్తే 2026 ఫిబ్రవరి 14లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, మునిసిపాలిటీ ఎన్నికలు రాక ముందే పీఏసీఎస్ ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ల పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించినప్పటికీ ఖరీఫ్‌లో రైతుల పంటలకు అందాల్సిన సేవలను దృష్టిలో ఉంచుకొని కూడా పదవీ కాలం పెంచి ఉంటారని తెలుస్తోంది. దీంతో సొసైటీ చైర్మన్లతో పాటు పాలకవర్గం పంటల సాగు రెండు సీజన్‌ల ప్రక్రియ చైర్మన్ల చేతుల మీదుగానే సాగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో యూరియా అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సొసైటీల ద్వారా యూరియా అందించి రైతుల అవసరాలు తీర్చుతోంది. రైతులకు కావాల్సిన యూరియా సొసైటీ పరిధిలలోని పంటల సాగును అంచనా వేసి అవసరమైన యూరియాను అందించడంలో సహకార సంఘాల పాత్ర ఎంతగానో ఉంది. దీనిలో భాగంగా సొసైటీ చైర్మన్లు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు నివేదికలు ఎప్పటికప్పుడు అందిస్తూ కావాల్సినంత యూరియా సమకూర్చుకుని రైతులకు సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని రైతులు కూడా సొసైటీ చైర్మన్ల పదవీ కాలం పొడిగించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు మరింత సేవ చేసే
అవకాశం..
పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు పలు రకాల సేవలను అందించే అవకాశం మరో ఆరు నెలలు పొడిగించడంపై ఆనందం వ్యక్తం చేశారు. అన్ని రకాల రుణాలను అందిస్తూ ధాన్యాన్ని కొంటూ పంటల సాగుకు అవసరమైన యూరియా, డీఏపీలను అందించడంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం.
–బొబ్బాల రమణారెడ్డి,
పీఏసీఎస్ చైర్మన్ నర్సంపేట
పీఏసీఎస్ చైర్మన్ల పదవీ కాలం
ఆరు నెలలు పొడిగింపు
కీలక సాగు సమయంలో రైతులకు ప్రయోజనకరం
జిల్లాలో 98 పీఏసీఎస్ సొసైటీలు

సహకారం మరింతగా..