
ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టండి
● ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్
అఽథారిటీ కమిషనర్ శశాంక
● ముంపు ప్రభావిత ప్రాంతాల్లో
క్షేత్ర స్థాయి పరిశీలన
రామన్నపేట: నగరం ముంపునకు గురవకుండా ప్రణాళిక ప్రకారం.. శాశ్వత చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అఽథారిటీ కమిషనర్ శశాంక అధికారులను ఆదేశించారు. ఆదివారం బల్దియా కమిషనర్ చాహత్‌బాజ్‌పాయ్ వివిధ విభాగాల అధికారులతో కలిసి భద్రకాళి బండ్, చిన్న వడ్డేపల్లి చెరువు ఐసీసీసీ కేంద్రాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. సమర్థంగా వరద ముంపును ఎదుర్కొనేందు కు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలిచ్చారు. భద్రకాళి చెరువు సమీపంలో ముంపునకు గురయ్యే ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోషిమాత కాలనీల పరిస్థితి తెలుసుకున్నారు.
శాశ్వత పరిష్కారానికి నిర్మాణాలు చేపట్టాలి
నగరంలోని వరద నీటి తీవ్రత స్థాయి అంచనాకు వివిధ విభాగాలు సమన్వయంతో పని చేయాలని శశాంక ఆదేశించారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవకుండా భద్రకాళి బండ్ ఇన్ లెట్ వద్ద వాస్తవ సామర్థ్యం? ఇన్ ఫ్లో? ఔట్ ప్లో తదితర విషయాల అధ్యయనానికి ఇరిగేషన్, బల్దియా, ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల సమన్వయం చేసుకోవాలని సూచించారు. భద్రకాళి చెరువు నిలువ సామర్థ్యాన్ని పెంచి వరద ముంపునకు గురికాకుండా నీటిని నిలువరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
కంట్రోల్ కేంద్రం పరిశీలన
కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని శశాంక పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. వర్షాకాలం నేపథ్యంలో నగరంలోని ప్రతీ చెరువుకు సంబంధించి నీటి ప్రవాహం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో సమాచారం ప్రతీ వార్డును ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా సమాచారం అందజేయాలన్నారు. సీఎంహెచ్‌ఓ రాజా రెడ్డి, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ సిటీ ప్లానర్లు మహేందర్, రవీందర్ రాడేకర్ తదితరులు పాల్గొన్నారు.