
పరకాల : పరకాల పట్టణంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణోత్సవం వేదమంత్రోచ్ఛరణలతో బుధవారం వైభవంగా జరిగింది. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో హాజరైన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి–సునంద దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు నరసింహా ఆచార్యులు ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు కల్యాణాన్ని కనులారా వీక్షించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ బాధ్యులు బెల్లం పాకం పంపిణీ చేసి, అన్నదానం చేశారు. కర్ణాటక సంగీత విద్వాంసులు ఉమ్మడి లక్ష్మణాచారి శిష్యబృందం భక్తి సంకీర్తనలు, భ్రమరాంబ కూచిపూడి నృత్యగురువు శిష్య బృందం నృత్య ప్రదర్శనలు అలరించాయి. సాయంత్రం మంగళవాయిద్యాలు, కోలాటాలతో పరకాల పట్టణ పురవీధుల్లో పల్లకీలో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఆలయ వ్యవస్థాపకులు చిట్టిరెడ్డి సమ్మక్క–పుల్లారెడ్డి, చిట్టిరెడ్డి వెంకట్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.