
కేయూ క్యాంపస్: ఈనెల 28, మే 5, 11, 12, 19, 26, 27, 28, 29, 30 తేదీల్లో కేయూ పరిధి దూరవిద్యాకేంద్రం మొదటి సెమిస్టర్ కాంటాక్టు తరగతులు నిర్వహించనున్నట్లు కేయూ దూర విద్యా కేంద్రం డైరెక్టర్ రాంచంద్రం తెలిపారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. కేయూ పరిధి హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, ఊట్నూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నిర్మల్ పంచశీల కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, జనగామ ఆర్‌ఆర్‌ఎం కాలేజీ, ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీ కౌటాల చైతన్య కాలేజీ, స్వాతి కాలేజీ, లక్షెట్టిపేట వైష్ణవి ఉమెన్స్ కాలేజీల్లో కాంటాక్టు తరగతులు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు సమీప కాలేజీల్లో కాంటాక్టు తరగతులకు హాజరు కావొ చ్చని డైరెక్టర్ రాంచంద్రం తెలిపారు.
ఎన్నికల అధికారులు
బాధ్యతగా పని చేయాలి
పరకాల: కొద్దిరోజుల్లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమాలను పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఆదేశించారు. పరకాలలోని లలిత కన్వెన్షన్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమాలను కఠినంగా అమలు చేయడంలో ఎంసీసీఎఫ్‌ఎస్‌టీ, వీఎస్ టీమ్‌లు బాధ్యతాయుతంగా పని చేయాలని స్పష్టం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు సంచరిస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ కె.నారాయణ, పరకాల ఏసీపీ కిశోర్‌కుమార్, ఏఓ విజయ్, పరకాల తహసీల్దార్ వెంకటభాస్కర్, డీటీ వరప్రసాద్, ఆర్‌ఐ, ఎన్నికల అధికారులు, ఫొటోగ్రాఫర్స్ పాల్గొన్నారు.
లా పరీక్షలో
11 మంది డీబార్
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో మూడేళ్ల లా కోర్సు మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవా రం ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన 11 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.రాజారెడ్డి తెలిపారు. కేడీసీలో నిర్వహిస్తున్న పరీక్షల తీరును కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాధిక తదితరులు పరిశీలించారు. ఐదేళ్ల లా కోర్సు పరీక్షలు కూడా మంగళవారమే ప్రారంభమయ్యాయి.
108 ఉద్యోగుల
సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో 108 సర్వీస్‌లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లకావత్ బాలాజీ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన వేం నరేందర్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంఘ వెంకట్రాజు, వరంగల్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ హరినాఽథ్‌సింగ్, ప్రజా సంఘాల నాయకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పాకురును తొలగించిన
మున్సిపల్ సిబ్బంది
కాజీపేట అర్బన్: ఇళ్ల చుట్టూ ఇదేం కంపు శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి మున్సిపల్ సిబ్బంది స్పందించారు. న్యూశాయంపేటలోని పలు కాలనీల్లో గ్రీన్ మ్యాట్‌లా పేరుకుపోయిన పాకురును శుభ్రం చేశారు. పాకురుతో ఇన్నాళ్లు దుర్వాసన మధ్య గడిపామని, సమస్యకు పరిష్కారం చూపిన ‘సాక్షి’కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
5కే రన్ వాయిదా
హన్మకొండ అర్బన్: ఓటరు చైతన్యంపై మంగళవారం ఉదయం 6 గంటలకు జరగాల్సిన 5కే రన్‌ను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. రన్ నిర్వహణ తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తామని పేర్కొన్నారు.

