భీమదేవరపల్లి : ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పేలుడు పదార్థాలు జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ బాక్సులు తీసుకెళ్తున్న వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన భీమదేవరపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వనాథకాలనీకి చెందిన గుంజి ఐలయ్య (40) అనే వ్యక్తి ఆటోలో పేలుడు పదార్థాలైన 8 బాక్సుల జిలెటిన్ స్టిక్స్, 1,950 డిటోనేటర్స్ బాక్సులు, పెద్ద కార్డెక్స్ వైర్ బండిల్స్ 8, చిన్న కార్డెక్స్ వైర్ బండిల్స్ 2 తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం, ముల్క నూర్ పోలీసులతో కలిసి దాడి చేశారు. ఐలయ్యను అదుపులోకి తీసుకుని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ ఆటోతో కలిపి సుమారు రూ.7,07,500గా అంచనా వేశారు. ఈ ఘటనలో మరో నిందితుడు వల్లెపు రాజయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో ఏసీపీ మధుసూదన్, ఇన్‌స్పెక్టర్లు రాజు, భానుప్రకాష్, ఆర్‌ఎస్‌ఐ, టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం పాల్గొన్నారు.


