కాజీపేట అర్బన్: డంపింగ్‌యార్డు నుంచి వెలువడే పొగతో మడికొండ, రాంపూర్ గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పలువురు వ్యాధులతో బాధపడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. కాజీపేట మండలం రాంపూర్ గ్రామంలో 2011 సంవత్సరంలో 36 ఎకరాల్లో చెత్తను పోగుచేసేందుకు డంపింగ్‌యార్డును ఏర్పాటు చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు పూట గడవడమే కష్టంగా ఉండగా.. మూలిగే నక్క మీద తాటికాయపడిన చందంగా డంపింగ్‌యార్డు నుంచి వెలువడుతున్న పొగ, విషవాయువులతో చర్మ వ్యాధులు, శ్వాసకోస వ్యాధుల బారినపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరి అప్పుల పాలవుతున్నారు.
రోజుకు 500 టన్నుల చెత్త..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 300 స్వచ్ఛ ఆటోలు, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా సుమారు సుమారు 500 టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. కాగా, ఎప్పటి చెత్తను అప్పుడు రీసైక్లింగ్ చేయాలి. చెత్త నుంచి కాగితాలు, పీచు, ఖాళీ బాటిళ్లు, మూతలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, సుమారు 24 రకాల వ్యర్థాలను వేరు చేసి సంబంధిత ఫ్యాక్టరీలకు పంపించాలి. కాగా, గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రూ.16 కోట్లతో రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. 36 ఎకరాల్లోని 16 ఎకరాల్లో పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేయాలని సంకల్పించారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ప్లాంట్ల నిర్వహణ సరిగాలేక రీసైక్లింగ్ ప్రక్రియ ఆగిపోయింది. తిరిగి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రూ. నాలుగు కోట్లతో నాలుగు రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసినా ఫలితం మాత్రం శూన్యం. అవి కూడా పని చేయ డం లేదు. దీంతో గుట్టలుగా పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్త మంటల్లో చిక్కుకుంటే ఫైరింజన్లతో ఆర్పివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డంపింగ్‌యార్డును తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
మరో ఢిల్లీగా మడికొండ–రాంపూర్
వాయుకాలుష్యం, పొగమంచు కోరల్లో చిక్కుకున్న దేశరాజధాని ఢిల్లీలో అక్కడి ప్రజలు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. అక్కడి పరిస్థితినే రాంపూర్‌లోని డంపింగ్‌యార్డు తలపిస్తోంది. ఉదయం చెత్త డంపింగ్, రాత్రి డంపింగ్ చేసిన చెత్తను కాల్చి వేయడం, చెత్తలో వివిధ రసాయన ప్రక్రియలు చోటుచేసుకుని మిథైన్ వాయువు ఉత్పత్తి అవుతోంది. దుర్వాసనతో కూడిన పొగ వెలువడి మడికొండ–రాంపూర్ రాత్రివేళ పొగమంచు కురిసినట్లు తలపిస్తోంది. డంపింగ్‌యార్డు పొగతో ఊపిరాడడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డంపింగ్‌యార్డు ఎత్తివేయాలని రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేసినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంటున్నారు.
రాంపూర్ డంపింగ్‌యార్డు నుంచి పొగ, విషవాయువులు
శ్వాసకోశ, చర్మ వ్యాధులబారిన
పడుతున్న ప్రజలు
రూ.కోట్లు ఖర్చుచేసినా
ప్రారంభంకాని చెత్త రీసైక్లింగ్


