కేయూ క్యాంపస్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో నిలవాలంటే కృత్రిమ మేధా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి కోరారు. యూనివర్సిటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులకు గురువారం రూసా 02 ప్రాజెక్టు కింద రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ ప్రతాప్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. హ్యాండ్స్ ఆన్ శిక్షణ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మంరింతగా మెరుగుపుడుతాయన్నారు. ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ ఎన్.రమణ, కె.భిక్షాలు, డాక్టర్ ఆసిం ఇక్బాల్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చి యార్డులో కొంతమంది దడవాయిలు జీరో దందా సాగిస్తున్నట్లు వెలుగుచూసింది. మార్కెట్‌లో జీరో జరిగితే అందుకు సూపర్‌వైజర్లు, ఇతర అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు తప్పవని జేడీఎం లక్ష్మణుడు.. ఇటీవల హెచ్చరించడంతో ఈ దందా వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మిర్చి సీజన్‌లో మార్కెట్ ఉద్యోగులు బిజీగా ఉండడం గుర్తించిన కొంతమంది దడవాయిలు రైతులతో మాట్లాడుకుని సరుకు ధరలను సగానికి తగ్గించి మార్కెట్ ఫీజును దోపిడీ చేస్తున్నట్లు బహిర్గతమైంది. బుధవారం వచ్చిన మిర్చికి పలికిన ధరలను మార్కెట్ అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించగా కొంతమంది రైతుల సరుకులకు సగం ధరలు పలికినట్లు వెల్లడి కావడంతో ఈదందా వెలుగు చూసింది. ఇందుకు కారణమైన దడవాయిలు తూర్పాటి రమేష్, నిమ్మాని నాంపల్లి, ఆకుతోట సతీష్‌లకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేషం నోటీసులు జారీ చేసి గురువారం వీరికి డ్యూటీలు వేయవద్దని ఆదేశాలు జారీ శారు. ఈ దందా కొన్నేళ్లుగా సాగుతున్నట్లు మార్కెట్‌లో చర్చించుకుంటున్నారు.
హసన్‌పర్తి/హన్మకొండ అర్బన్ : వరంగల్ నగరంలో వివిధ ప్రాంతాల్లోని హోటళ్లలో సివిల్ సప్లయ్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. గృహవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లు అఽధికారులు గుర్తించారు. 73 సిలిండర్లను సీజ్ చేశారు. సీజ్ చేసిన సిలిండర్లను ఇందు శేఖర్, బోగేస్ గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించినట్లు సివిల్ సప్లయీస్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో డీటీలు భద్రునాయక్, వేణుగోపాల్, ఎఫ్‌ఐ సదానందం పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: చండీఘర్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో ఈనెల 14నుంచి 16వరకు జరగనున్న ఆల్‌ఇండియా ఇంటర్ యూనివర్సిటీ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టును ఎంపిక చేసినట్లు గురువారం స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. జట్టులో జి.అనూషా, బి.ప్రతూషా, కె.శ్రావణి బి.అంజలి, జె.శ్రావణి ఉన్నట్లు పేర్కొన్నారు. వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ రవీందర్ కోచ్‌కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు.


