కరీమాబాద్/ఖిలా వరంగల్: ‘సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం స్వర్ణయుగాన్ని తలపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఉజ్వల భవిష్యత్ ఉండేలా చేపట్టిన ప్రణాళికలన్నీ మంచి ఫలితాలిస్తున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా చేసుకుంటున్నాం’ అని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖిలా వరంగల్ పడమర కోటలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ అవతరణ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఖిలా వరంగల్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం వరంగల్ ఓ సిటీ సమీపంలోని ఐడీఓసీ నిర్మాణ స్థలంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవానికి మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో వరంగల్ కీలకపాత్ర పోషించిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతోనే వారికి నిజమైన నివాళులని చెప్పారు. వరంగల్ బిడ్డగా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. వరంగల్ జిల్లా 2014–15లో తలసరి ఆదాయం రూ.82,084 కోట్లు ఉండగా.. 2020–21లో జిల్లా తలసరి ఆదాయం రూ.1,71,111 కోట్లకు పెరగడం స్వరాష్ట్ర పాలనకు నిదర్శనమన్నారు. పర్యాటక రంగంలో పాకాల సరస్సు, కొమ్మాల శ్రీ లక్ష్మి నృసింహస్వామి దేవాలయం, వరంగల్‌లో పురావస్తు ప్రదర్శనశాల అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం గీసుకొండ, సంగెం మండలాల్లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్ ప్రావీణ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్‌లు శ్రీవత్స, అశ్వినితానాజీ వాకడే, ఆర్డీఓ మహేందర్‌జీ, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీ బోనాల కిషన్, ఆర్డీఓ మహేందర్ జీ, తహసీల్దార్ ఫణికుమార్, ఇన్‌స్పెక్టర్ ముస్క శ్రీనివాస్, కార్పొరేటర్లు సువర్ణ, బైరబోయిన ఉమ, సిద్దంరాజు, మరిపెల్లి రవి, బీఆర్‌ఎస్ నేతలు సురేశ్, నాగపూరి సంజయ్‌బాబు, బయ్యస్వామి, బైరబోయిన దామోదర్, కై లాస్‌యాదవ్, ఈద్గా అధ్యక్షుడు ఎంఏ జబ్బార్, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ నేత సీఎం కావడం మన అదృష్టం
నీళ్లు, నిధులు, నియామకాలతో
అమరులకు నిజమైన నివాళులు
మండలి డిప్యూటీ చైర్మన్
డాక్టర్ బండా ప్రకాశ్
అంబరాన్నంటిన ‘అవతరణ’ సంబురాలు
జాతీయ జెండాను ఎగురవేస్తున్న రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్


