వనపర్తికి ‘సురక్షిత్‌’ జిల్లాగా గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

వనపర్తికి ‘సురక్షిత్‌’ జిల్లాగా గుర్తింపు

Nov 19 2026 12:37 PM | Updated on Nov 19 2026 12:37 PM

వనపర్తి: హెచ్‌ఐవీ నియంత్రణ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సతో పాటు వ్యాధిగ్రస్తులకు నిరంతర వైద్యసేవలు అందించే ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. హెచ్‌ఐవీ నియంత్రణలో జిల్లాకు లభించిన గుర్తింపును కొనసాగిస్తూ భవిష్యత్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (నాకో) నిర్దేశించిన 95–95–95 లక్ష్యాల సాధనలో జిల్లా మెరుగైన ప్రగతి కనబర్చి ‘సురక్షిత్‌’ జిల్లాగా గుర్తింపు పొందింది. నాకో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమ్మాన్‌ సమారోహ్‌’ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా సురక్షిత్‌ కేటగిరీకి ఎంపికై న 20 జిల్లాల్లో వనపర్తి చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (టీజీఎస్‌ఏసీఎస్‌) డిప్యూటీ డైరెక్టర్‌ పి.మేఖల బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమాల అధికారులు జిల్లాలో సాధించిన ప్రగతిని కలెక్టర్‌కు వివరించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిలో 95 శాతం మందికి తమ వ్యాధి స్థితిపై అవగాహన కల్పించడం, వ్యాధి నిర్ధారణ అయిన వారిలో 95 శాతం మందికి యాంటీ రెట్రోవైరల్‌ థెరపీ(ఏఆర్‌టీ) చికిత్స అందించడం, చికిత్స పొందుతున్న వారిలో 95 శాతం మందికి వైరల్‌ సప్రెషన్‌ సాధించడం ప్రధాన లక్ష్యాలని వివరించారు. ఈ మూడు ప్రమాణాల ఆధారంగా జిల్లాల పనితీరును అంచనా వేసి సురక్షిత్‌, సక్షమ్‌, సంఘర్ష్‌శీల్‌ విభాగాలుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం, వైద్య, ఆరోగ్యశాఖ, ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం అధికారులు, ఐసీటీసీ, ఏఆర్టీ, సీఎస్‌సీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది సమన్వయ కృషితోనే జిల్లాకు గుర్తింపు లభించిందని ఆమె చెప్పారు. అనంతరం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ నియంత్రణలో జిల్లాకు గుర్తింపు రావడం అభినందనీయమన్నారు. ఈ ప్రగతిని కొనసాగిస్తూ ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని, వ్యాధి నిర్ధారణ పరీక్షలను విస్తృతం చేయాలని, బాధితులకు సకాలంలో చికిత్స అందించడంతో పాటు నిరంతర వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గుర్తింపు సాధించేందుకు కృషి చేసిన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. భాస్కర్‌నాయక్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, వైద్యసిబ్బంది, కౌన్సిలర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఏఆర్టీ కేంద్రాల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా. భాస్కర్‌నాయక్‌, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా. చంద్రమోహన్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డా. వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement