అమరచింత: సమగ్ర భూ రీ–సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ ఆదేశించారు. మండలంలోని కిష్టంపల్లిలో కొనసాగుతున్న భూ రీ–సర్వేను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే బృందాలు నిర్వహిస్తున్న భూముల కొలతలు, సరిహద్దుల గుర్తింపును తహసీల్దార్ రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూ రికార్డుల్లో కచ్చితత్వం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర భూ రీ–సర్వే చేపడుతోందన్నారు. సర్వేనంబర్ల వారీగా భూముల కొలతలు చేపట్టడంతో పాటు సంబంధిత భూ యాజమానులు, రైతుల సమక్షంలోనే హద్దులను గుర్తించాలని సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి భూ వివాదాలకు తావులేకుండా సరిహద్దు రాళ్లను పక్కాగా గుర్తించి వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయాలని స్పష్టం చేశారు. రీ–సర్వే ప్రక్రియలో ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పులకు ఆస్కారం లేకుండా రికార్డులను సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రవికుమార్ యాదవ్, డీటీ, సర్వేయర్లు ఉన్నారు.
బాధ్యతలు చేపట్టిన డీఐఈఓ
వనపర్తిటౌన్: జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా ఆర్.అవిలయ్య గురువారం జిల్లాకేంద్రంలోని డీఐఈఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అధ్యాపక సంఘం నాయకులు ఆయనను పుష్పగుచ్ఛం, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధికి అధ్యాపకులు సమష్టిగా కృషి చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి మెరుగైన ఫలితాలు సాధించేలా బాధ్యతతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపక సంఘం నాయకులు కురుమూర్తి, కృష్ణయ్య, వెంకట్‌రెడ్డి, గోపాల్, శేషయ్య, జ్ఞానేశ్వర్‌రెడ్డి, విజయ్‌కుమార్, కురుమూర్తి, వెంకటకృష్ణ, మహేశ్వర్, రవీందర్, బీరయ్య తదితరులు పాల్గొన్నారు.
జోగుళాంబ జోన్–7 అదనపు డీఐజీగా చందనాదీప్తి
మహబూబ్‌నగర్ క్రైం: జోగుళాంబ జోన్–7 డీఐజీగా అదనపు బాధ్యతలను 2012 బ్యాచ్‌కు చెందిన జి.చందనాదీప్తికి ప్రభుత్వం అప్పగించింది. ఫ్యూచర్ సిటీ కమిషరేట్ అడ్మిన్ అండ్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రెగ్యులర్ పోస్టుతోపాటు జోగుళాంబ జోన్–7 డీఐజీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో డీఐజీగా పనిచేసిన ఎల్‌ఎస్ చౌహాన్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఆ తర్వాత ఇన్‌చార్జి డీఐజీ బాధ్యతలను మల్టీజోన్–2 ఐజీ షానవాజ్‌ఖాసీంకు ఇవ్వగా.. ఇప్పుడు మళ్లీ రెగ్యులర్ అధికారికి కాకుండా అదనపు బాధ్యతలే అప్పగించడం గమనార్హం. అయితే ఉమ్మడి జిల్లాలో ఎస్పీల పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన డీఐజీ పోస్టు రెగ్యులర్ లేకపోవడంతో పోలీస్ శాఖ బాస్‌లపై దృష్టి లేకుండా పోతుంది. అలాగే హెడ్‌కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐ వరకు చేయాల్సిన బదిలీల అంశంతోపాటు ఇతర ఫైళ్లపై సంతకాల కోసం జిల్లాల నుంచి సిబ్బంది హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది.


