వనపర్తి: రైతులకు భవిష్యత్‌లో ఎలాంటి భూ సమస్యలు, వివాదాలు తలెత్తకుండా భూముల రీ–సర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాలతో పాటు నక్షా లేని గ్రామాల్లో నెలాఖరులోగా భూ రీ–సర్వే పూర్తి చేయాలన్నారు. రీ–సర్వే చేపట్టే గ్రామాల్లో సంబంధిత రైతులకు ముందుగానే సమాచారం అందించాలని, నోటీసులు జారీచేసి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు. రీ–సర్వే వివరాలు, అభ్యంతరాల సమర్పణ విధానం, వాటి పరిష్కార ప్రక్రియపై ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలకు వివరాలు తెలియజేయడంతో పాటు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. వచ్చిన అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను క్యూఆర్ కోడ్‌తో అందించనున్న నేపథ్యంలో భూముల సర్వే వివరాలు, రికార్డులు కచ్చితత్వంతో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో రాంరెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం, సర్వేశాఖ ఏడీ శ్రీనివాసులు పాల్గొన్నారు.


