ఖిల్లాఘనపురం: ప్రభుత్వ నిబంధనల ప్రకారమే భూ రీ–సర్వే కొనసాగుతోందని ఆర్డీఓ సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం మండలంలోని అంతాయపల్లి, సూరాయపల్లిలో నిర్వహిస్తున్న భూ రీ–సర్వేను తహసీల్దార్ సుగుణతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు.. సర్వే అధికారులతో మాట్లాడి సర్వే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, రైతుల నుంచి వస్తున్న వినతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. అంతాయపల్లిలో బుధవారంతో సర్వే పూర్తవుతుందని, సూరాయపల్లిలో ప్రస్తుతం సర్వే ప్రారంభించినట్లు వివరించారు. సర్వే జరుగుతున్న సమయంలో రైతులు అందుబాటులో ఉండి చూసుకోవాలని.. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. వారి వెంట డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్, ఆర్ఐ తిరుపతయ్య, సర్వేయర్ ఆనంద్, జీపీఓ ఆనందం, లైసెన్స్డ్ సర్వేయర్లు మల్లయ్య, కురుమూర్తి ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.


