జూరాల కాల్వలకు నిలిచిన నీటి సరఫరా
‘ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మాసన్న. ఆత్మకూర్ మండలం గుంటిపల్లి స్వగ్రామం. జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న డీ–6 కాల్వ నీటి ఆధారంగా 5 ఎకరాల్లో వరి సాగుచేశారు.
ఎకరాకు రూ.30 వేల పెట్టుబడి అయింది. ప్రస్తుతం పంట పొట్టదశలో ఉండగా.. కాల్వలకు నీటి సరఫరా నిలిపివేయడంతో ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం చొరవచూపి నెలాఖరు వరకు నీటిని
వదలాలని కోరుతున్నారు.’
అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఆయకట్టు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మరో రెండు తడులుగా వారబందీ విధానంలో వదిలితేనే పంటలు చేతుకొస్తాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1.687 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండటంతో ఈ నెల 3న కాల్వలకు నీటి సరఫరా నిలిపివేశారు. భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా జలాశయంలోని నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం ప్రకటించడంతో కుడి, ఎడమ కాల్వలకు నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఎగువ నుంచి వరద వస్తేనే నవంబర్ వరకు కాల్వలకు నీటిని వదులుతామని.. లేకుంటే కష్టమంటున్నారు. ఈ నెలలో 3 రోజుల పాటు కాల్వలకు సాగునీటిని అందించి పూర్తిస్థాయిలో నిలిపివేయనున్నట్లు పీజేపీ సీఈ రహీమోద్దీన్ వెల్లడించారు. ప్రస్తుతం వరి పొట్టదశలో ఉందని.. సాగునీరు వదులుతేనే పంటలు చేతికందుతాయని ఆయకట్టు రైతులు అంటున్నారు. ఆయకట్టు రైతులు జూరాల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు తమ సమస్యలను విన్నవించడంతో కుడి, ఎడమ కాల్వలకు ఇప్పటి వరకు 4 తడులు వారబందీ విధానంలో నీటిని అందించారు. జూరాల ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు, కుడికాల్వ పరిధిలో 30 వేల ఎకరాల పంటలు సాగయ్యాయి. ఎగువ నుంచి వరద రాకపోవడమే నీటి సరఫరా నిలిపివేతకు ప్రధాన కారణం.
పొట్టదశలో వరిపైరు..
జూరాల కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులోని వరిపైర్లు ప్రస్తుతం పొట్టదశలో ఉన్నాయి. ఇదే సమయంలో తెగుళ్లు సైతం సోకడంతో అన్నదాతలు ఆగమాగం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత నెల 31 నుంచి 4 రోజుల పాటు కాల్వలకు సాగునీటిని వదిలారు. ఇక నుంచి నీటి సరఫరా నిలిచిపోతే చివరిదశలో ఉన్న పంటలను ఎలా కాపాడుకోవాలన్న ఆందోళనలో రైతులున్నారు. నెలాఖరు వరకు రెండు తడులైనా ఇవ్వాలని వేడుకుంటున్నారు. నీరందక పోతే తమకు నష్టాలు తప్పవని.. ప్రభుత్వం తమ బాధలను అర్థం చేసుకొని ఒక్క పంటకై నా పూర్తిస్థాయిలో నీటిని వదలాలని కోరుతున్నారు.
నిలిచిన నీటి సరఫరా..
వారబందీ విధానంలో భాగంగా శనివారం జూరాల ఆయకట్టుకు నీటి సరఫరాను పూర్తిస్థాయిలో నిలిపివేశారు. కుడి, ఎడమ కాల్వలకు నిత్యం 1,700 క్యూసెక్కుల నీటిని వదిలేవారు. వారబందీ గడువు ముగియడంతో నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు.
జూరాల జలాశయంలో నీటిమట్టం
మరో రెండు తడులు
అవసరం అంటున్న అన్నదాతలు
ఇప్పటి వరకు
4 విడతల్లో నీటి విడుదల
జలాశయంలో
1.687 టీఎంసీల నీటినిల్వ


