మరోవైపు దీపావళి సందర్భంగా టపాసుల విక్రయాలు కూడా జోరందుకున్నాయి. జిల్లాకేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో 25 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటితోపాటు పట్టణ శివారులోని నాగవరం ప్రాంతంలోనూ పలువురు వ్యాపారులు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో రూ.10 నుంచి రూ.5 వేల వరకు వివిధ రకాల టపాసులను అందుబాటులో ఉంచారు. చిన్నారుల కోసం చిచ్చుబుడ్లు, కాకరపు వత్తులు మొదలుకొని వివిధ రకాల రంగురంగుల టపాసుల వరకు విక్రయాలు సాగాయి. కుటుంబాలతో కలిసి వచ్చిన వారు తమకు నచ్చిన రకాలను ఎంపిక చేసుకుని కొనుగోలు చేశారు. విక్రయ కేంద్రాల వద్ద అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తగా నీటి బకెట్లు, ఇసుక, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచారు. టపాసుల విక్రయ ప్రాంతాల్లో భద్రతా నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశారు. పండుగకు ముందే కొనుగోళ్లు ఊపందుకోవడంతో వస్త్ర దుకాణాల నుంచి టపాసుల కేంద్రాల వరకు జిల్లాకేంద్రంలో ఎటుచూసినా దీపావళి సందడే కనిపించింది.


