వనపర్తిటౌన్: చెడుపై గెలిచిన మంచికి ప్రతీక దీపావళి. ఏటా అశ్వయుజ మాసం అమావాస్య రోజు దీపావళి వస్తుంది. ఆదివారం పిల్లలు, మహిళలు, పురుషులు, రైతులు, వ్యాపారులు ఇలా అందరూ.. నరక చతుర్దశి నాడు ఉదయాన్నే స్నానాలు ఆచరించి ఇంటిల్లిపాది పండుగలో పాల్గొంటారు.
దీపావళి వేళ జిల్లాకేంద్రంలోని పలు దుకాణాలు సందడిగా మారాయి. పండుగకు అవసరమైన వస్తు సామగ్రి కొనుగోళ్లతో ప్రధాన వీధులు, వ్యాపార సముదాయాలు కిటకిటలాడాయి. మామిడి ఆకులు, నోములకు అవసరమైన సామగ్రి, ప్రమిదలు, దీపాలు, పూజాసామగ్రి, పూలు, పూలదండలు, పండ్ల కొనుగోళ్లకు వివిధ ప్రాంతాల ప్రజలు దుకాణాలకు తరలివచ్చారు. ముఖ్యంగా నోములు ఆచరించే మహిళలు పూజలకు కావాల్సిన వస్తువులతో పాటు కొత్త దుస్తుల కొనుగోలుకు ప్రాధాన్యమిచ్చారు. జిల్లాకేంద్రంలోని మార్కెట్, కమాన్ చౌరస్తా, పాత బస్టాండ్, బస్టాండ్ పరిసరాలు, బస్సు డిపో రోడ్డు ప్రాంతాల్లోని దుకాణాలు వినియోగదారులతో రద్దీగా మారాయి. పట్టణంలోని వివిధ సూపర్ మార్కెట్లు, కార్పొరేట్ వ్యాపార సముదాయాల్లోనూ కొనుగోళ్లు జోరుగా సాగాయి.


