ప్రత్యామ్నాయ
ఏర్పాట్లపై దృష్టి..
రోజురోజుకు పెరుగుతున్న పశుగ్రాసం ధరలు
● ఎల్‌నినో ఎఫెక్ట్.. పాడి రైతులకు కష్టాలు
● వేసవిలో పశుపోషణ కష్టమే
● పాల దిగుబడిపైనా ప్రభావం పడే
అవకాశం
● నివారణకు పశుసంవర్ధకశాఖ
ముందస్తు ప్రణాళికలు
ప్రస్తుతం 10 గేదెలతో పాల వ్యాపారం కొనసాగిస్తున్నా. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక సహజంగా లభించే పశుగ్రాసం దొరకడం లేదు. గతంలో వరిగడ్డి కట్ట రవాణా ఖర్చులతో కలిపి రూ.50 నుంచి రూ.60కి విక్రయించేవారు. ఇప్పుడు అదే కట్టకు రూ.130 చెల్లించాల్సి వస్తోంది. గడ్డి కొరతతో పాడి పరిశ్రమ నిర్వహణ కష్టమవుతోంది. ప్రభుత్వం పాడి రైతులకు రాయితీపై దాణా, పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావాలి.
– సత్యారెడ్డి, పాడి రైతు, అమరచింత
వర్షాలు లేక భూమిపై పచ్చిగడ్డి కనిపించడం లేదు. సాగు చేసిన నాలుగు ఎకరాల వరి నీరులేక వరి ఎండిముఖం పడుతోంది. 8 గేదెలు, 6 గొర్రెలు ఉన్నాయి. గతంలో ఉదయం, సాయంత్రం కలిపి 14 లీటర్ల పాలు వచ్చేవి. పచ్చిగడ్డి తిన్నప్పుడు గేదెలు ఎక్కువ పాలు ఇస్తాయి. సంక్రాంతి తర్వాత ఎండుగడ్డిని అందించేవారం. కానీ ఈసారి వర్షాలు లేక ఇప్పటి నుంచే ఎండుగడ్డిపై ఆధారపడాల్సి వస్తోంది. పాల దిగుబడి కూడా తగ్గింది. మున్ముందు పశువులకు మేత ఎలా సమకూర్చాలో అర్థం కావడం లేదు.
– రాఘవేంద్రరెడ్డి పాడి రైతు అమరచింత.
ఎల్‌నినో నేపథ్యంలో పశువుల సంరక్షణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా రైతులకు రాయితీపై పశుగ్రాస విత్తనాలు, పంట అవశేషాల సంరక్షణ, వ్యక్తిగత పశుగ్రాసం పెంపును ప్రోత్సహిస్తున్నాం. వీబీజీ రాంజీ పథకం ద్వారా ఎకరా పొలంలో గడ్డి పెంచేందుకు తగిన వసతి కల్పిస్తున్నాం. వ్యాధుల నివారణకు టీకాలు, నులిపురుగుల నివారణ కార్యక్రమాలు చేపడుతున్నాం.
– వెంకటయ్యగౌడ్,
జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి
అమరచింత: వానలు లేక పంటలు ఎండుతున్నాయి. పశువులకు మేత కరువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితులు పాడి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా వరి కోతల సమయంలో అందుబాటులోకి వచ్చే గడ్డి పశువులకు ప్రధాన ఆహారంగా ఉపయోగపడుతుంది. అయితే ఈసారి కరువు పరిస్థితులు, పంటల దిగుబడిపై అనిశ్ఛితి నెలకొనడంతో పశుగ్రాసం లభ్యత, ధరలు చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రానున్న యాసంగి సీజన్‌లో వరి సాగు వద్దని ప్రభుత్వం సూచిస్తుండటంతో మేత కొరత తీవ్రం కావచ్చనే అంచనాలతో పశుసంవర్ధకశాఖ ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. పశువులకు మేత, తాగునీరు అందించడంతో పాటు పాల ఉత్పత్తిపై వాతావరణ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది.
ధరల భారంతో దిగులు..
పాడి పశువుల సంరక్షణలో వరిగడ్డి కీలకపాత్ర పోషిస్తుంది. వరి కోతల అనంతరం లభించే గడ్డిని రైతులు నిల్వ చేసుకొని ఏడాది పొడవునా వినియోగిస్తుంటారు. గతంలో సొంత పొలాల్లోని గడ్డిని సేకరించి పశువులకు మేతగా వినియోగించేవారు. తప్పని పరిస్థితులుంటేనే ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం మేత అవసరాలు పెరగడం, రవాణా ఖర్చులు తోడవ్వడంతో గడ్డి కొనుగోలు పాడి రైతులకు భారంగా మారుతోంది. ఈసారి కోతల సమయంలోనూ గడ్డి ధరలు ఏ మేరకు ఉంటాయన్నది కీలకంగా మారింది. దిగుబడులు తగ్గితే అందుబాటులోకి వచ్చే గడ్డి పరిణామం తగ్గి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
పాలఉత్పత్తిపై ప్రభావం..
పశువులకు తగినంత పోషకాహారం, స్వచ్ఛమైన తాగునీరు అందకపోతే పాల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. చలికాలంలో సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదైతే పశువులపై వేడి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీంతో పాల దిగుబడి తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. పాడి రైతులు ముందస్తుగా పశుగ్రాసాన్ని నిల్వ చేసుకోవడం, పశువులకు నిరంతరం నీరు అందించడం, నీడ కల్పించడం అవసరం.
పశుగ్రాస కొరతను నివారించేందుకు అధికారులు వ్యక్తిగత పశుగ్రాస ప్లాట్ల ఏర్పాటు, పంట అవశేషాల సంరక్షణ, రాయితీపై పశుగ్రాస విత్తనాల పంపిణీకి ప్రణాళికలు రూపొందించారు. పశువులకు తాగునీరు అందించేందుకు నీటి తొట్టెల మరమ్మతు, అవసరమైనచోట కొత్త తొట్టెల నిర్మాణంపై దృష్టి సారించారు. వ్యాధుల పర్యవేక్షణ, టీకాలు, నులిపురుగుల నివారణ, అత్యవసర పశువైద్య శిభిరాల నిర్వహణకు చర్యలు చేపడుతోంది. పశుగ్రాస నిల్వలు, ధరల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు అవసరమైన సూచనలు అందిస్తే కరువు ప్రభావాన్ని కొంతమేర తగ్గించే వీలుంది.


