కొత్తకోట: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, తార్కిక ఆలోచన, పరిశీలన నైపుణ్యం, సృజనాత్మకశక్తిని పెంపొందించే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు–2026 నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు దేవని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను మండల విద్యాశాఖ కృష్ణయ్య, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలాదేవి, ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 37 ఏళ్లుగా చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే శాసీ్త్రయ ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలని, మూఢ నమ్మకాలకు దూరంగా ఉంటూ ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ పోటీలు భవిష్యత్‌లో శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడతాయని.. నిర్వహణకు తెలంగాణ సమగ్రశిక్షా అభియాన్ కూడా ప్రోత్సాహం అందిస్తోందని వెల్లడించారు. చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్‌ను నాలుగు దశల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 12వ తేదీన పాఠశాల స్థాయి, 21న మండల స్థాయి, 28న జిల్లాస్థాయి, డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్నారు. 8, 9, 10 తరగతుల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు అర్హులని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఉపాధ్యాయులు రామకృష్ణ, కేశవాచారి, రవికుమార్, సత్యనారాయణ, రమేష్, వెంకటేష్, పద్మావతి, విజయలక్ష్మి, సుధారాణి, రెహనాబేగం, వెంకటయ్య పాల్గొన్నారు.


