కొత్తకోట రూరల్: భూ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర రీ–సర్వే కీలకమని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం వనపర్తి మండలం నాచహళ్లితో పాటు కొత్తకోట మండలం నాంచారమ్మపేట, పుల్లారెడ్డికుంటలో కొనసాగుతున్న భూ సమగ్ర రీ–సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రీ–సర్వేకు సంబంధించిన రికార్డులు, ఇప్పటి వరకు పూర్తయిన పనుల పురోగతిని తనిఖీచేసి సంబంధిత రెవెన్యూ, సర్వేశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లో భూ సమగ్ర రీ–సర్వే పనులను మరింత వేగవంతం చేయాలని, నిర్ణీత సమయంలోగా పూర్తిచేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సర్వే ప్రక్రియలో గ్రామస్తులు, రైతులను భాగస్వాములను చేయాలని, వారికి ముందస్తు సమాచారమిచ్చి నిరంతరం వారితో మమేకమై పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా పట్టా భూముల సర్వే సమయంలో భూ యజమానులు తప్పనిసరిగా హాజరయ్యేలా అవగాహన కల్పించాలని తెలిపారు. భవిష్యత్‌లో భూ వివాదాలకు తావులేకుండా పారదర్శకమైన రికార్డులు రూపొందించాలన్నారు. రీ–సర్వే పనులను నాణ్యతగా, పారదర్శకంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఆయన వెంట వనపర్తి, కొత్తకోట తహసీల్దార్లు రమేష్‌రెడ్డి, సుభాష్‌నాయుడు, రెవెన్యూ, సర్వేశాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


