అమరచింత: ప్రజారోగ్య సేవల్లో దాదాపు రెండు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు ఉద్యోగ భద్రతకు పోరుబాట పట్టారు. ప్రజల ప్రాణాలు కాపాడుతున్న తమ భవిష్యత్‌కు ఏ మాత్రం భరోసా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులు, కుటుంబ పోషణ, అనారోగ్య ఖర్చుల మధ్య అభద్రతతో కాలం వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ ఈ నెల 13 నుంచి చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 22వ రోజుకు చేరింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 292 మంది ఉద్యోగులు..
ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న వివిధ విభాగాల ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా 292 మంది ఆందోళనబాట పట్టారు. వీరిలో 52 మంది ఎంఎల్‌హెచ్‌పీలు, 12 మంది ఆర్‌బీఎస్‌కే వైద్యులతో పాటు 51 మంది ఫార్మసిస్టులు, 9 మంది డాటాఎంట్రీ ఆపరేటర్లు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక ల్యాబ్ మేనేజర్, 13 మంది కాంటెంజెంట్ సిబ్బంది, 83 మంది సెకండ్ ఏఎన్‌ఎంలు, 10 మంది డీఎంహెచ్‌ఓ ఆఫీస్ సిబ్బంది, ముగ్గురు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది, 10 మంది స్టాఫ్ నర్సులతో పాటు సిబ్బంది ఉన్నారు.
రోగులకు తప్పని ఇబ్బందులు..
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు నమ్మెబాట పట్టడంతో ఆస్పత్రులకు వస్తున్న రోగులకు సరైన వైద్యసేవలు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల నుంచి ఆస్పత్రులకు వచ్చే గర్భిణులు, బా లింతలు, చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడాల్సి వ స్తోంది. ఆస్పత్రుల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడం లేదా సేవలు పరిమితం కావడంతో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రయాణ ఖర్చులు పెట్టుకొ ని ఆస్పత్రులకు వస్తున్న రోగులకు నిరాశే ఎదురవు తోంది. ఈ క్రమంలో కొందరు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించడంతో అదనపు ఖర్చులు తప్పడం లేదు.
ప్రజారోగ్యంలో కీలకపాత్ర..
జిల్లా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీలు, పల్లె, బస్తీ దవాఖానాల్లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కీలక సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పరీక్షలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో ముందుండి పనిచేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వైద్యసేవలు అందించడంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇంతటి బాధ్యతలు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకమని వాపోతున్నారు.
కుటుంబానికి
భరోసా కల్పించాలి..
ఉద్యోగి విధుల్లో ఉండగా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కల్పించాలి. ప్రతినెలా ఐదో తేదీలోగా వేతనాలు, పెండింగ్ ఇంక్రిమెంట్లు, లాయల్టీ బోనస్, ఈహెచ్‌ఎస్, ప్రమాద బీమా అమలు చేయాలి. – డా. అనిత,
మెడికల్ ఆఫీసర్, ఆర్‌బీఎస్‌కే, గోపాల్‌పేట
ప్రసూతి సెలవులు ఇవ్వాలి..
ఆస్పత్రుల్లో రోగులకు సేవలందిస్తూ ప్రభుత్వ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తమకు ఉద్యోగ భద్రత, సముచిత వేతనాలు, ఆరోగ్య బీమా వంటి కనీస ప్రయోజనాలు అందడం లేదు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ప్రభుత్వం వెంటనే తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలి. – డా. రూపశ్రీ,
వైద్యుడు, ఆర్‌బీఎస్‌కే, పెబ్బేరు
న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి..
ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే తమ కర్తవ్యమని సేవలందిస్తున్న తమకు ప్రభుత్వం భరోసా కల్పించడంలో విఫలమైంది. రెండు దశబ్దాలుగా వైద్యసేవలు అందిస్తున్న తమను నేటికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం శోచనీయం. న్యాయమైన కోరికలు వెంటనే నెరవేర్చాలి.
– డా. నిసార్ అహ్మద్, మెడికల్ ఆఫీసర్,
ఆర్‌బీఎస్‌కే, ఆత్మకూర్
వైద్యసేవలకు ఇబ్బందులు..
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు 22 రోజులుగా చేస్తున్న సమ్మె కారణంగా ఆస్పత్రుల్లో వైద్యసేవలకు ఇబ్బందులు కలుగులుతున్నాయి. వాటిని అధిగమించేందుకు రెగ్యులర్ వైద్యులు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌నర్స్‌లతో పాటు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. ఆస్పత్రులకు వస్తున్న రోగులకు వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– భాస్కర్‌నాయక్, జిల్లా వైద్యాధికారి
22 రోజులుగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె
కుటుంబాలకు భరోసా.. ఉద్యోగ భద్రతకు ఆందోళన
న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరసనలు
ఉద్యోగుల సమ్మెతో
వైద్యసేవలకు ఆటంకం
డిమాండ్లు ఇవే..
ఉద్యోగ భద్రత కల్పిస్తూ క్రమబద్దీకరించాలి.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.
ప్రతి కేడర్‌కు వేతన నిర్ధారణ చేసి 100 శాతం గ్రాస్ వేతనంగా చెల్లించాలి.
జీఓనంబర్ 1195 ప్రకారం వేతన సమస్యలను పరిష్కరించాలి.
కాంట్రాక్టు ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్ విధానంలోకి మార్చకుండా స్టేట్ హెల్త్ సొసైటీ ద్వారానే వేతనాలు చెల్లించాలి.
ప్రతినెల ఐదోతేదీలోగా వేతనాలు విడుదల చేయాలి. పెండింగ్‌లో ఉన్న 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్ మంజూరు చేయాలి.
ఉద్యోగులందరికీ ఈహెచ్‌ఎస్, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి.
మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి.
విధుల్లో ఉండగా ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబసభ్యులకు కారుణ్య నియామకం కల్పించాలి.


