నీటి సంరక్షణపై విస్తృత అవగాహన | - | Sakshi
Sakshi News home page

నీటి సంరక్షణపై విస్తృత అవగాహన

Nov 4 2026 2:20 AM | Updated on Nov 4 2026 2:20 AM

వనపర్తి: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటికొరత తలెత్తే ప్రమాదం ఉన్నందున జిల్లావ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా, మండలస్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13లోపు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి నీటి సంరక్షణ ప్రాముఖ్యత, వృథాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యవసాయశాఖ రూపొందించిన అవగాహన పోస్టర్లను ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. యాసంగి సీజన్‌లో పంటల సాగుకు అనుమతించరాదని.. రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకు వినియోగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. వీబీజీ రాంజీ పథకం కింద కూలీలకు విస్తృతంగా ఉపాధి కల్పించాలని.. ఇప్పటికే సిద్ధంగా ఉన్న పనుల జాబితాతో పాటు అదనంగా మరిన్ని పనులను గుర్తించి సెల్ఫ్‌ ఆఫ్‌ వర్కర్స్‌ సిద్ధం చేసుకోవాలన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణ నిర్మాణాలు, భూగర్భ జలాల పెంపునకు రిచార్జి గుంతలు, పాంపాండ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలపై దృష్టి సారించాలని సూచించారు. పశువులకు అవసరమైన గడ్డి పెంపకం పనులు చేపట్టాలన్నారు. నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 1 వరకు మిషన్‌ భగీరథ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని.. ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరాకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించి ఏవైనా మరమ్మతులుంటే వెంటనే పూర్తి చేయాలని, అవసరమైన చోట బోర్‌వెల్స్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించాలన్నారు. ప్రస్తుతం నిర్దేశించిన పనుల పురోగతిపై రానున్న పది రోజుల్లో మరోసారి సమీక్ష ఉంటుందని.. ఆ సమావేశానికి ప్రతి మండల అధికారి తాము చేపట్టిన చర్యలు, పనుల పురోగతికి సంబంధించిన కార్యాచరణ నివేదికతో హాజరుకావాలన్నారు. ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి రాంరెడ్డి, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement