వనపర్తి రూరల్: పెబ్బేరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలుర సబ్ జూనియర్ కబడ్డీ జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించారు. మొత్తం 128 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ప్రతిభ చాటిన 25 మందిని శిక్షణ శిబిరానికి ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.కురుమయ్య తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు జి.నర్సింహగౌడ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి ఆర్.గోపాల్, ఈసీ సభ్యుడు కమలాకర్, కోచ్‌లు ఖలీల్, శివ, కిషోర్, పీడీ రాధిక, ఉపాధ్యాయ బృందం, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు
జలాశయాలను తనిఖీ చేసిన ఆక్టోపస్ బృందం
మదనాపురం: రాష్ట్రంలోని కీలక జలాశయాల వద్ద భద్రతను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా మండలంలోని సరళాసాగర్, రామన్‌పాడు జలాశయాలను ఆక్టోపస్ ఆర్‌ఐ రమేష్, సీఐ శివకుమార్, ఎస్‌ఐ జగదీశ్వర్ మంగళవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. జలాశయ గేట్ల ప్రాంతం, సైఫన్ వ్యవస్థ, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జలాశయాల రక్షణ చర్యల్లో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు వారు వివరించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు పోలీసు, ఇరిగేషన్ శాఖలు ఎలా స్పందించాలనే అంశంపై ఇరు శాఖలు అధికారులు సుదీర్ఘంగా సమీక్షించారు. జలాశయాల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, నిరంతరం నిఘా ఉంటుందని అధికారులు వెల్లడించారు. వారి వెంట ప్రాజెక్టు ఏఈలు తదితరులు ఉన్నారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
వనపర్తిటౌన్: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి దీప కాసరగడ్డ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 19వ వార్డు గాంధీనగర్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 18 ఏళ్లలోపు బాలికలు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహాలు చేయవద్దని, బాల్య వివాహాల నిరోధక చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాల్య వివాహాలు చేసిన, ప్రోత్సహించినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరకట్న నిషేధ చట్టం, అదనపు కట్నం వేధింపులు, మోటారు వాహనాల చట్టం, సైబర్ నేరాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం గాంధీనగర్‌లోని సీఆర్‌సీ భవనంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన న్యాయ సహాయ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రజలు న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయసాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ ఎం.శ్రీదేవి, వార్డు అధికారి, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


