వనపర్తి: ప్రస్తుత ఎల్‌నినో ప్రభావిత వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటిఎద్దడిని దృష్టిలో ఉంచుకొని కూరగాయల రైతులు తక్కువ నీటితో మెరుగైన దిగుబడులు సాధించేలా శాసీ్త్రయ సాగు పద్ధతులు అవలంబించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి (డీహెచ్‌ఎస్‌ఓ) విజయభాస్కర్ సూచించారు. మంగళవారం మదనాపురం కేవీకేలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో కూరగాయల రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ పద్ధతులను అనుసరించడంతో నేలలో తేమను సంరక్షించుకోవచ్చన్నారు. కేవీకే శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి కూరగాయల సాగులో ఆశించే ప్రధాన చీడపీడలు, తెగుళ్ల గుర్తింపు, సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యంపై అవగాహన కల్పించారు. అనంతరం ఉద్యాన అధికారి శివతేజ మాట్లాడుతూ.. జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు స్థానికంగా కూరగాయల ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్థానిక రైతులే జిల్లాకు అవసరమైన కూరగాయలను పండించే దిశగా ముందుకు రావాలని కోరారు. ఉద్యానశాఖ నుంచి అమలవుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి బాలప్రకాష్ పాల్గొన్నారు.


