చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి తెలిపారు. ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం ఆమె ఆలయ పరిసరాలను పరిశీలించారు. భక్తుల రద్దీ ఉండే ప్రాంతాలు, ప్రధాన ఆలయానికి చేరుకునే ఎక్కుడు, దిగుడు మెట్లు, రాజగోపురం, ఘాట్‌రోడ్డు, బస్టాండ్ చౌరస్తా, దుకాణ సముదాయాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు పెంచడంతోపాటు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు. ఎస్పీ వెంట సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ గోకరి, ఆలయ చైర్మన్ బత్తుల బాల్‌రాజు, ఈఓ మధనేశ్వరెడ్డి, కమిటీ సభ్యులు మైపాల్‌రెడ్డి, భరత్‌రెడ్డి ఉన్నారు.


