తవ్వారు.. వదిలేశారు! | - | Sakshi
Sakshi News home page

తవ్వారు.. వదిలేశారు!

Nov 3 2026 2:15 AM | Updated on Nov 3 2026 2:15 AM

వనపర్తిటౌన్‌: జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణ పనులు అస్తవ్యస్థంగా కొనసాగుతున్నాయి. స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాల నుంచి బస్టాండ్‌ వరకు ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా నాలుగు రోజుల క్రితం రోడ్డుకు ఇరువైపులా డ్రెయినేజీ నిర్మాణం కోసం భారీ కాల్వలు తవ్వారు. ఆ మట్టిని రోడ్డుపైనే కుప్పలుగా వదిలేయడంతో చెరువు కట్టను తలపిస్తోంది. దుకాణాల ఎదుటే కాల్వలు తవ్వడం.. మట్టిని అక్కడే వదిలేయడంతో దుకాణదారులతో పాటు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే ఇరుకుగా ఉన్న రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

దుకాణాలకు వెళ్లాలన్నా దారిలేదు..

డ్రెయినేజీల కోసం తవ్విన గోతులు, రోడ్డుపై పోసిన మట్టి, రాళ్ల కారణంగా దుకాణాల్లోకి వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. దీంతో దుకాణదారులే కట్టెలు, తడకలతో తాత్కాలిక దారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయినప్పటికీ వినియోగదారులు దుకాణాలకు చేరుకోవడం కష్టంగా మారింది. మరోవైపు వాహనదారులు ట్రాఫిక్‌ సమస్యతో సతమతమవుతున్నారు.

ప్రజలకు తప్పని ఇక్కట్లు..

రోడ్ల విస్తరణతో పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుతాయన్న ఆశ ఉన్నప్పటికీ.. ప్రస్తుతం పనుల నిర్వహణ తీరుతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. తవ్వకాలు చేపట్టిన వెంటనే మట్టి, రాళ్లను తొలగించి, రహదారిని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉండగా.. రోజుల తరబడి అలాగే వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పనులు చేపట్టడం ఎంత ముఖ్యమో.. వాటి వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్‌ అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న రాళ్లు, మట్టి కుప్పలను తొలగించి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపైనే మట్టి కుప్పలు

రోడ్డు విస్తరణ పనులతో వాహనదారులకు ఇబ్బందులు

మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల అసహనం

అధికారులను అప్రమత్తం చేస్తాం..

రోడ్ల విస్తరణలో భాగంగా డ్రెయినేజీ కోసం తవ్విన మట్టి, రాళ్లు రోడ్డుపై ఉండటం ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే. కొందరు స్వచ్ఛందంగా విస్తరణకు ముందుకు వస్తుండటంతో అధికారులు ఆ బిజీలో ఉన్నారు. అధికారులను అప్రమత్తం చేసి, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా మట్టి, రాళ్లను తొలగించేలా చర్యలు తీసుకుంటాం.

– మధుసూదన్‌గౌడ్‌,

మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌, వనపర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement