అధిక ధరలకు బియ్యం అమ్మితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అధిక ధరలకు బియ్యం అమ్మితే చర్యలు

Nov 3 2026 2:15 AM | Updated on Nov 3 2026 2:15 AM

వనపర్తి: జిల్లాలో బియ్యం, ఇతర నిత్యవసరాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వినోద్‌కుమార్‌ హెచ్చరించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ధరల పర్యవేక్షణ, నియంత్రణ కమిటీ సమావేశంలో బియ్యం వ్యాపారులు, కిరాణా వర్తకులతో బియ్యం నిల్వలు, సరఫరా, ధరల నియంత్రణ, మార్కెట్‌ పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతాయనే అంచనాలతో కొందరు వ్యాపారులు ముందస్తుగా బియ్యం నిల్వలు చేసి, బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కృత్రిమ కొరత సృష్టించి ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా వ్యవహరించినా, ప్రజలను మోసం చేసి ఇబ్బందులకు గురిచేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు బీపీటీ, కేఎన్‌ఎం రకం బియ్యం కిలో రూ.66, ఆర్‌ఎన్‌ఆర్‌, తెలంగాణ సోనా రకం రూ.74, జేఎస్‌ఆర్‌, హెచ్‌ఎంటీ రకం బియ్యం కిలో రూ.79కు మించకుండా విక్రయించాలన్నారు. బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల నిల్వలు, సరఫరా, ధరల విషయంలో వ్యాపారులు పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా వ్యాపారులు సహకరించాలని కోరారు. సమావేశంలో డీఆర్వో రాంరెడ్డి, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, జిల్లా పౌరసరఫరాల డీఎం హరీశ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement