వనపర్తి: ‘కరువుతో పంటలు నష్టపోయిన రైతులు, కూలీలకు ఏం సాయం అందిస్తామనేది స్పష్టం చేయకుండా కరువు మండలాలు ప్రకటించడం ఏమిటి.. అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి, వరిసాగు కోసం పెట్టిన పెట్టుబడులు, పంటనష్టం తదితర వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. పక్కనున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో ఎండిన పంటలకు ఇన్‌ఫుట్ సబ్సిడీతోపాటు వ్యవసాయ కూలీలకు రూ.12 వేల సాయం అందించనున్నట్లు కరువు మండలాల ప్రకటనతో అక్కడి ప్రభుత్వాలు వెల్లడించాయన్నారు. ఇక్కడ అవగాహన లేని రేవంత్‌రెడ్డి మాత్రం కరువు మండలాలు ప్రకటించి.. చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దు.. మిమ్మల్ని ఆదుకునేందుకే పాలమూరు పర్యటనకు వచ్చాం.. పాలకులను నిలదీసి అందరికీ పరిహారం అందించేలా చూస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతుల సమస్యలను విస్మరించి.. ఢిల్లీలో కూర్చొని మియ్యాపూర్ భూముల విక్రయాలు, వచ్చే కమీషన్లపై సుదీర్ఘ చర్చలు చేయడాన్ని రాష్ట్రంలో కడుపు మండిన రైతులు గమనిస్తున్నారన్నారు. వాటాల కోసం ఢిల్లీలో ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే మద్యం తాగి కుమ్ములాడుకోవడం ప్రస్తుతం తెలంగాణలో హాట్‌టాఫిక్‌గా మారిందన్నారు.
కప్పం కట్టేందుకే ఢిల్లీకి..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 82 సార్లు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను గాలికి వదిలి.. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు రాష్ట్రం నుంచి కప్పం కట్టేందుకే పదే పదే వెళ్తున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాలు పారాల్సిన పాలమూరు గడ్డపై పంటలు ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ సుమారు 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి పాలమూరును పచ్చగా మారిస్తే.. మూడేళ్ల రేవంత్‌రెడ్డి పాలనలో మళ్లీ కరువుచాయలు, వలస వెళ్తున్న కుటుంబాలే కనిపిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఒక్క కారులోనూ పంటలు ఎండిపోలేదని గుర్తుచేశారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి పాలమూరులో ఎన్ని చెరువులు దురస్తు చేశారు.. ఎన్ని చెక్‌డ్యాంలు కట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వానాకాలంలో 25 లక్షల ఎకరాలను ఎండబెట్టి యాసంగిలో పంటలకు, కరెంట్‌కు పూర్తి సెలవు ప్రకటించిన కాంగ్రెస్ పాలకులకు రోజులు దగ్గర పడ్డాయన్నారు.
వరదను దిగువకు వదిలేయడంతో..
ఎగువ నుంచి జూరాలకు వచ్చిన వరద జలాలను కాంగ్రెస్ పాలకులు ముందుచూపు లేకుండా దిగువకు వదిలేయడంతో ఏపీ ప్రభుత్వం 100 టీఎంసీలను వేర్వేరు ప్రాజెక్టులతో ఎత్తిపోసుకుని కరువును అధిగమించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తాము పండగలా మార్చిన వ్యవసాయాన్ని.. కాంగ్రెస్ పాలకులు దండగలా మార్చారని దుయ్యబట్టారు. మరొక్క ఏడాది ఓపిక పడితే.. మళ్లీ కేసీఆర్ పాలన వచ్చి రైతుల కష్టాలు తీరుతాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీమంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రజని, నాయకులు గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, రఘుపతిరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రైతులను గాలికొదిలేసి సీఎం ఢిల్లీ పర్యటనలు
అన్నదాతకు ధైర్యం చెప్పేందుకే పాలమూరుకు వచ్చాం
మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


