ఉద్యోగులు నిస్వార్థంగా సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులు నిస్వార్థంగా సేవలందించాలి

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

వనపర్తి: ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉంటూ ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ టి.వినోద్‌కుమార్‌ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌–2026లో భాగంగా అవినీతి నిరోధకశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు అవినీతి నిరోధకశాఖ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌కే జిలానీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగం ప్రజలకు సేవచేసే గొప్ప అవకాశమని, ప్రతి ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. అవినీతికి దూరంగా ఉంటూ ప్రజలకు పారదర్శక సేవలు అందించాలన్నారు. అవినీతికి అలవాటుపడితే అది వ్యసనంగా మారి నిజాయితీగా పనిచేసే ఉద్యోగుల ప్రతిష్టను సైతం దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు బాధ్యతలను గుర్తించి ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. అనంతరం ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతూ.. సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని ఏటా అక్టోబర్‌ 26 నుంచి నవంబర్‌ 1 వరకు విజిలెనన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ చారుసిన్హా ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు నైతిక విలువలు పాటిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. లంచం తీసుకోవడం, ఇవ్వడం రెండూ నేరాలేనన్నారు. అవినీతిని అరికట్టేందుకు అవినీతి నిరోధకశాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్‌ చేసినా, అవినీతికి పాల్పడినా, అవినీతికి సంబంధించిన అక్రమాలు జరిగినా ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్వో రామిరెడ్డి, జెడ్పీ సీఈఓ యాదయ్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement