వనపర్తి: సైబర్ మోసాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో వెంటనే స్పందించకుండా ఆగడం (పీఏయూఎస్‌ఈ), నిజానిజాలను ఆలోచించడం (టీహెచ్‌ఐఎన్‌కే), అధికారిక మార్గాల్లో ధ్రువీకరించుకోవడం (వీఈఆర్‌ఐఎఫ్‌వై) అనే మూడు సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ డి.సునీతరెడ్డి అన్నారు. జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం సందర్భంగా శుక్రవారం రాత్రి పట్టణంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో సైబర్ ఫ్లాష్‌వాక్ నిర్వహించారు. కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాల నుంచి ప్రారంభమైన ఫ్లాష్ వాక్ అంబేడ్కర్ చౌక్ వరకు కొనసాగి తిరిగి కళాశాలకు చేరుకుంది. పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తమ మొబైల్ ఫోన్ల టార్చ్‌లైట్లు వెలిగిస్తూ పీఏయూఎస్‌ఈ, టీహెచ్‌ఐఎన్‌కే, వీఈఆర్‌ఐఎఫ్‌వై నినాదాలతో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు నకిలీ లింకులు, ఫేక్ వెబ్‌సైట్లు, ఫోన్‌కాల్స్, సందేశాలు, సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అనుమానాస్పద లింకులు, సందేశాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఆగడం (పీఏయూఎస్‌ఈ), వాటి నిజానిజాలను ఆలోచించడం (టీహెచ్‌ఐఎన్‌కే), అధికారిక మార్గాల్లో ధ్రువీకరించుకోవడం (వీఈఆర్‌ఐఎఫ్‌వై) చేయాలన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా హెల్ప్‌లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని లేదా www.cybercrime. gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. సైబర్ నేరాల నివారణ పోలీసుల బాధ్యత మాత్రమే కాదని.. ప్రతి ఒక్కరిదిగా వ్యవహరించాలని పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలపై అప్రమత్తంగా ఉంటూ ఇతరులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, సీఐ సుగంధ రత్నం, సైబర్‌క్రైమ్ సీఐ శ్రీనునాయక్, సైబర్‌క్రైమ్ ఎస్‌ఐ రవిప్రకాష్, టౌన్ ఎస్‌ఐ హరిప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ పర్వతాలు, సైబర్‌క్రైమ్ సిబ్బంది, పోలీసు అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


