డ్రగ్‌పెడ్లర్లపై ప్రత్యేక నిఘా.. | - | Sakshi
Sakshi News home page

డ్రగ్‌పెడ్లర్లపై ప్రత్యేక నిఘా..

Nov 1 2026 8:19 AM | Updated on Nov 1 2026 8:19 AM

వనపర్తి రూరల్‌: గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ప్రధాన డ్రగ్‌పెడ్లర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో ఛేదించాలని తెలంగాణ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఈగల్‌ ఫోర్స్‌) ఎస్పీ పద్మజ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునీతరెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌డీపీఎస్‌ కేసులపై జిల్లా పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నమోదైన కేసులు, పురోగతి, పెండింగ్‌ కేసుల దర్యాప్తు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సరఫరా వ్యవస్థపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్‌డీపీఎస్‌ చట్టంపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని, పక్కా ఆధారాలతో కేసుల దర్యాప్తు పూర్తిచేసి నిందితులకు శిక్షపడేలా చార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. నిందితులకు బెయిల్‌, రెమిషన్‌ వంటి అంశాల్లో చట్టపరమైన నిబంధనలను సమర్థవంతంగా అమలు చేస్తూ కేసుల విచారణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నషా ముక్త్‌భారత్‌ 2029 లక్ష్యంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ డ్రగ్స్‌ దుష్పరిణామాలను వివరించాలని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ సునీతరెడ్డి మాట్లాడుతూ.. వనపర్తిని మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్‌శాఖ తరఫున సమగ్ర కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు, యువత, విద్యాసంస్థలను భాగస్వాములను చేస్తూ డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరారు. ఈగల్‌ఫోర్స్‌ డీఎస్పీ బుచ్చయ్య, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్‌ సీఐలు సుగంధరత్నం, రమేష్‌, శివకుమార్‌, ఎస్సైలు, ఈగల్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement