ఖిల్లాఘనపురం: ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. నీటిలభ్యత పెంపునకు గ్రామాల్లో పాంపాండ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలో వీబీజీరాంజీ పథకంలో భాగంగా ఫీడర్ చానల్ పనులను డీఆర్డీఓ ఉమాదేవితో కలిసి పరిశీలించారు. అలాగే వెంకటాంపల్లి, సోళీపురం గ్రామంలో నిర్మించిన పాంపాండ్లను పరిశీలించి మాట్లాడుతూ.. కరువును దృష్టిలో ఉంచుకొని కూలీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క కూలీకి 125 పనిదినాలు కల్పించాలని సూచించారు. పాంపాండ్ల నిర్మాణాలతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలన్నారు. అధికారులు, కూలీలతో మాట్లాడి పనుల వివరాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి సామగ్రి నిల్వగది, ఆవరణ, తరగతి గదులు, హాస్టల్ గదులు పరిశీలించి సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని.. నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదని హెచ్‌ఎం రాంలాల్‌నాయక్‌ను ఆదేశించారు. విద్యార్థులు శుభ్రంగా ఉండటంతో పాటు మెరుగైన ఫలితాల కోసం కష్టపడి చదవాలని, అందుకు ఉపాధ్యాయులు సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ విజయసింహారెడ్డి, గ్రామపెద్దలు ఆగారం ప్రకాష్, నాగేష్ తదితరులు ఉన్నారు.


