యుద్ధప్రాతిపదికన రహదారి పనులు | - | Sakshi
Sakshi News home page

యుద్ధప్రాతిపదికన రహదారి పనులు

Oct 28 2026 12:42 AM | Updated on Oct 28 2026 12:42 AM

వనపర్తి: జిల్లాలో ఇప్పటికే మంజూరైన ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రహదారి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి అఽధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ, కొత్త రోడ్లు వేయడానికి ఉన్న ఇబ్బందులు పరిష్కరించడానికి సంబంధితశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని సూచించారు. వనపర్తి–పెబ్బేరు, పానగల్‌ రహదారి విస్తరణ, పెద్దమందడి రోడ్డు, కొత్తగా మంజూరై హ్యాంరోడ్లు, వనపర్తి బైపాస్‌ రోడ్డు పనుల పెండింగ్‌కు గల కారణాలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా శంకుస్థాపన చేసిన రహదారి పనులు ఇప్పటి వరకు ఎందుకు ప్రారంభం కావడం లేదని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు. పెద్దమందడి రహదారి పనులు చేపట్టేందుకు విద్యుత్‌ స్తంభాలు మార్చాలి ఉందని, మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ సమస్య సైతం ఉందని అధికారులు వెల్లడించారు. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు మార్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని విద్యుత్‌శాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మిషన్‌ భగీరథ, విద్యుత్‌, పంచాయత్‌రాజ్‌ అధికారులు సంయుక్తంగా జాయింట్‌ సర్వే చేసి రహదారి విస్తరణ పనులకు ఆటంకంగా ఉన్న అన్ని అంశాలను పరిష్కరించి వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అదేవిధంగా వనపర్తి–ఆత్మకూర్‌ బైపాస్‌ రోడ్‌కు ఆటంకంగా ఉన్న అటవీ భూమిపై చర్చిస్తూ కలెక్టర్‌ సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వనపర్తి–పెబ్బేరు, వనపర్తి–బుద్దారం, వనపర్తి–పానగల్‌ రోడ్లపై సమీక్షించారు. ఆక్రమణలను వెంటనే తొలగించి స్థలం కోల్పోతున్న యజమానులకు టీడీఆర్‌ అమలు చేసి అవసరమైన మేరకు స్థలం సేకరించే విధంగా చర్యలు చేపట్టాలని పుర కమిషనర్‌ను ఆదేశించారు. విస్తరణ పనులు ఇప్పటికే చాలా ఆలస్యమయ్యాయని, వెంటనే పనులు ప్రారంభించాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అవసరమైన మోటార్లు ఇతర సామగ్రి కోసం నివేదికలు సమర్పించి వేసవిలో నీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని మిషన్‌ భగీరథ అధికారిని ఆదేశించారు. జిల్లాలో నీరు, విద్యుత్‌ పొదుపుగా వినియోగించే విధంగా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, జిల్లా అటవీ అధికారి నవీన్‌రెడ్డి, పుర చైర్‌పర్సన్లు మాధవి రమేష్‌, శ్రీనివాస్‌గౌడ్‌, పుర వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ తిరుపతిరావు, డీఈ శ్రీనివాస్‌, పంచాయతీరాజ్‌ కార్యనిర్వాహక ఇంజినీర్‌ విజయ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ కార్యనిర్వాహక ఇంజినీర్‌ ప్రమీల, పుర కమిషనర్‌ నిరంజన్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement