అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోవడంతో ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం జూరాలలో 2.862 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండటంతో ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. రానున్న గడ్డుకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక తాగునీటి అవసరాలకే జలాశయంలోని నీటిని నిల్వ ఉంచుకోవాలని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులు జూరాల కుడి, ఎడమ కాల్వలకు శనివారం సాగునీటిని నిలిపివేశారు. ఎగువ నుంచి వరదలు వస్తేనే నవంబర్ వరకు సాగునీటిని విడుదలచేసే అవకాశాలు ఉన్నాయని.. వరద రాకపోతే ఈ నెలాఖరులో 4 రోజులపాటు కాల్వలకు సాగునీటిని అందించి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో నిలిపివేయనున్నట్లు పీజేపీ సీఈ రహీముద్దీన్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం వరిపైరు పొట్టదశలో ఉందని.. నవంబర్ వరకు సాగునీరు అందిస్తేనే పంట చేతికొస్తుందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
అమరచింత ఎత్తిపోతల పరిధిలో సింగంపేటకు చెందిన రైతు విష్ణుమూర్తి 18 ఎకరాలను కౌలుకు తీసుకొని వరిసాగు చేశారు. ఇప్పటికే ఎకరానికి రూ.30 వేలు ఖర్చుపెట్టారు. ప్రస్తుతం వరిపైరు పొట్టదశలో ఉంది. జూరాల ఎడమ కాల్వ ద్వారా అమరచింత ఎత్తిపోతలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం కాల్వలకు సాగునీటిని నిలిపివేయడంతో సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతు విష్ణుమూర్తి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి నవంబర్ చివరి వరకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.
జూరాలకు పూర్తిగా నిలిచిన వరద
ప్రాజెక్టులో కేవలం 2.862 టీఎంసీలు మాత్రమే నిల్వ
ఈనెల 31 నుంచి 4 రోజులు మాత్రమే చివరి తడి అందిస్తామని అధికారుల ప్రకటన
ఆందోళనలో ఆయకట్టు రైతులు
నవంబర్ వరకు సాగునీరు అందించాలని వేడుకోలు
కుడి, ఎడమ కాల్వ పరిధిలో 1.15లక్షల ఎకరాల్లో వరిసాగు
4 ఎకరాల్లో వరిసాగు..
అమరచింత ఎత్తిపోతల ద్వారా ఆయకట్టుకు వస్తున్న సాగునీటిపై ఆధారపడి 4 ఎకరాల్లో వరిసా గు చేస్తున్నా. మొదట్లో సాగునీరు వస్తుందో.. రాదో అన్న సందేహాలతో కాస్త ఆలస్యంగా వరిసాగు చేశా. ఎకరం సాగుకు ఇప్పటికే రూ. 25వేల వరకు ఖర్చు పెట్టాను. నీటి సరఫరా నిలిచిపోతే పంట ఎండిపోవడం ఖాయం.
– కిరణ్‌కుమార్‌రెడ్డి, రైతు, అమరచింత
ఇక చివరి తడి మాత్రమే..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నాం. ఎగువ నుంచి వరద రాకపోవడంతో నిల్వ ఉన్న నీటితో ఇప్పటి వరకు సాగునీటిని వారాబందీ ద్వారా అందించాం. ప్రస్తుతం ప్రాజెక్టులో రెండున్నర టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ నెలాఖరు నుంచి 4 రోజుల పాటు మాత్రమే చివరి తడిగా కాల్వలకు సాగునీరు అందిస్తాం.
– చంద్రశేఖర్, ఎస్‌ఈ


